Terrorists: పూంచ్ ఉగ్రదాడిలో జవాన్లపై 36 రౌండ్ల కాల్పులు జరిపిన టెర్రరిస్టులు
- స్టిక్కీ బాంబులతో జవాన్ల వాహనం పేల్చివేత
- రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల దాడి
- హోంశాఖ, ఎన్ఏఐకు ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి
జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఫూంచ్ జిల్లాలోని భీంబెర్ గాలి నుంచి సంగియోట్ వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో తెగబడ్డారని, వాహనం ఆయిల్ ట్యాంక్ పేలడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని తొలుత భావించారు. కానీ, ఈ దాడిలో ఉగ్రవాదులు స్టిక్కీ బాంబులను ఉపయోగించినట్లు భద్రతా దళాలు శనివారం వెల్లడించాయని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ బాంబులను వాహనాలకు జోడించి రిమోట్ లేదా టైమర్‌ల ద్వారా పేల్చవచ్చు.
బాంబులతో పాటు జవాన్లపైకి ఉగ్రవాదులు సమీపం నుంచి 36 రౌండ్ల కాల్పులు జరిపినట్టు గుర్తించారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఫోరెన్సిక్ బృందం ఆర్మీ ట్రక్కుపై 36 రౌండ్ల బుల్లెట్లతో సహా అన్ని నమూనాలను సేకరించింది. ట్రక్కు నుంచి రెండు గ్రెనేడ్ పిన్నులను కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆర్మీ సిబ్బందిని తరలించిన ముగ్గురు పారామెడిక్స్ వాంగ్మూలాలు కూడా రికార్డు చేశారు. గత ఏడాది కత్రాలో జరిగిన దాడిని పోలిన విధంగానే ఈ ఉగ్రదాడి జరిగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో ఆర్మీ, రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ బలగాల భారీగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 2000 మంది కమాండోలను ఈ ఆపరేషన్ కోసం మోహరించారు.
ఇక, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ దాడికి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో ఒక నివేదికను పంచుకుంది. రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాళ్లు పాక్ ప్రేరేపిత గ్రూపులకు చెందినవారని కూడా వర్గాలు పేర్కొన్నాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా సహాయంతో ఉగ్రవాదులు దాడి చేశారని నిఘా వర్గాలు తెలిపాయి.