Akshaya Tritiya: నేడు అక్షయ తృతీయ.. బంగారం కొనే ముందు వీటిని తెలుసుకోండి..!

Akshaya Tritiya 2023 things to keep in mind before buying gold jewellery

  • బంగారంలో స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన్యం
  • హాల్ మార్క్ ఆభరణాలనే కొనుగోలు చేసుకోవాలి
  • దీంతో నాణ్యతకు భరోసా
  • విక్రయించేటప్పుడు సరైన విలువ వస్తుంది

అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే కలిసొస్తుందన్న ఒక నమ్మకం మన సమాజంలో ఏర్పడింది. అందుకే ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు నమోదవుతుంటాయి. అక్షయ తృతీయ రోజున బంగారంలో పెట్టుబడి అయినా, ఏదైనా కొత్తగా ప్రారంభించినా లేదా పెట్టుబడి చేసినా అది అదృష్టాన్ని ఇస్తుందని నమ్ముతారు. హిందువులతోపాటు జైనులు సైతం దీన్ని జరుపుకుంటారు. శనివారం అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా బంగారం కొనుగోలు చేసే వారు కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలి.

ప్యూరిటీ
బంగారం కొనుగోలులో అన్నింటికంటే మొదట చూడాల్సింది ప్యూరిటీనే. ఆభరణాలకు సంబంధించి  22 క్యారెట్లు నాణ్యమైనది. మీరు కొంటున్నది 22క్యారెట్లతో చేసిందా లేక 18 క్యారట్లా లేక 14 క్యారట్లా అన్నది చూడాలి. హాల్ మార్క్ ధ్రువీకరణ ఉందంటే నాణ్యతకు భరోసా ఉన్నట్టు. ఆభరణాలు అయినా లేక గోల్డ్ కాయిన్లు అయినా హాల్ మార్క్ ఉన్నవే తీసుకోవాలి. దానిపై బీఐఎస్ మార్క్ కూడా ఉంటుంది. నాణ్యత సర్టిఫికెట్ కూడా ఇస్తారు. 

బరువు, ధర
వర్తకుడు ఏ ప్రకారం చార్జీలు వేసిందీ గమనించాలి. జ్యుయలర్లు మేకింగ్ చార్జెస్ (తయారీ చార్జీలు) విధిస్తుంటారు. సంబంధిత ఆభరణం డిజైన్ పై ఈ చార్జీ ఆధారపడి ఉంటుంది. నిజానికి ఈ రూపంలోనే వర్తకులకు లాభాలు సమకూరుతుంటాయి. వీటిని సుమారు 15-20 శాతం మేర విధిస్తుంటారు. బేరమాడితే ఇందులో తగ్గింపు లభిస్తుంది.

బడ్జెట్
బంగారం ఎంత పెట్టి కొనాలని అనుకుంటున్నారనేది ముందుగానే నిర్ణయించుకోండి. జ్యుయలరీ షాపునకు వెళ్లి అంత మొత్తంలోనే ఆభరణం ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ముందే బ్యాంకులో కొనగోలుకు సరిపడానే ఉంచుకుని వెళ్లాలి. ఎందుకంటే ఆభరణాల కొనుగోలు విషయంలో చాలా మంది అనుకున్నదాని కంటే అధిక మొత్తంతో కొనుగోలు చేసుకుని వస్తుంటారు. దీనికి కారణం అక్కడ కళ్లు చెదిరి, కట్టిపడేసే డిజైన్ల వల్లే.

ఉద్దేశ్యం
బంగారం ఎందుకు కొనుగోలు చేస్తున్నారో? ముందే ప్రశ్నించుకోవాలి. పెట్టుబడి కోసం అయితే బంగారం ఆభరణాలకు బదులు బార్లు లేదా కాయిన్లు ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల తయారీ చార్జీలు పడవు. పైగా తిరిగి విక్రయించడం, మార్చుకోవడం కూడా సులభం. అదే ఆభరణం అయితే తయారీ చార్జీలు, వేస్టేజ్ పేరుతో కొంత నష్టపోవాల్సి  వస్తుంది. 

సర్టిఫికేషన్
ఆభరణం కొనుగోలు చేసే ముందు సర్టిఫికేషన్ ఇస్తారేమో కనుక్కోవాలి. ఇస్తేనే కొనుగోలు చేయాలి. ప్రముఖ సంస్థలు అన్నీ కూడా నేడు సర్టిఫికేషన్ ఇస్తున్నాయి. 

రిటర్న్/ఎక్సేంజ్
ప్రముఖ సంస్థలు ఆభరణం నచ్చకపోతే దాన్ని రిటర్న్ చేసేందుకు అనుమతి ఇస్తున్నాయి. లేదా నచ్చిన ఆభరంతో దాన్ని మార్చుకోవచ్చు. కొన్ని సంస్థలు మార్పిడి కాకుండా రిటర్న్ ఇచ్చి డబ్బులు చెల్లించేట్టు అయితే, కొంత మొత్తాన్ని చార్జీ కింద మినహాయిస్తుంటాయి.

  • Loading...

More Telugu News