NSG: యర్రగొండపాలెం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న ఎన్ఎస్ జీ
- యర్రగొండపాలెంలో చంద్రబాబు కారుపై రాళ్ల దాడి
- చంద్రబాబు భద్రతాధికారికి తల పగిలిన వైనం
- యర్రగొండపాలెం పరిణామాలపై ఆరా తీసిన ఎన్ఎస్ జీ హెడ్ క్వార్టర్స్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిన్న సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆయన కారుపై రాళ్ల దాడి జరిగాయి. ఈ ఘటనలో చంద్రబాబు భద్రతా విధుల్లో ఉన్న ఎన్ఎస్ జీ కమాండెంట్ సంతోష్ కుమార్ కు తల పగిలింది.
ఈ ఘటనను ఢిల్లీలోని ఎన్ఎస్ జీ ప్రధాన కార్యాలయం తీవ్రంగా పరిగణిస్తోంది. యర్రగొండపాలెంలో జరిగిన పరిణామాలపై ఆరా తీసింది. నిన్న జరిగిన పరిణామాలపై ఎన్ఎస్ జీ బృందం తమ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించింది. ఆందోళనకారులను చంద్రబాబు సమీపానికి రానివ్వడం పట్ల ఎన్ఎస్ జీ ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతేడాది నందిగామలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరగ్గా, ఓ భద్రతాధికారికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో, నందిగామ, యర్రగొండపాలెం ఘటనలపై ఎన్ఎస్ జీ నివేదిక రూపొందిస్తోంది. దీనిపై ఇవాళ గానీ, రేపు గానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.