Arjun Tendulkar: క్రికెట్ అంతే... ఒక ఓవర్లో 31 పరుగులిచ్చిన సచిన్ తనయుడు
- నేడు ముంబయి ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- తొలి స్పెల్ లో వికెట్ తీసి ఫర్వాలేదనిపించిన అర్జున్
- ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బంతిపై నియంత్రణ కోల్పోయిన అర్జున్
- ఉతికారేసిన పంజాబ్ బ్యాటర్లు
- ఆ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సులు బాదిన వైనం
క్రికెట్ ఆట చాలా చిత్రమైనది. ఒక ఆటగాడ్ని అందలం ఎక్కించే ఆట, అదే ఆటగాడ్ని కిందికి పడదోస్తుంది. తాజాగా, సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు ఈ విషయం అనుభవంలోకి వచ్చింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఆఖరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అర్జున్ టెండూల్కర్... ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఒకే ఓవర్లో 31 పరుగులిచ్చి దిగ్భ్రాంతి కలిగించాడు.
ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి రెండు ఓవర్లలో ఓ వికెట్ కూడా తీసి ఫర్వాలేదనిపించిన అర్జున్... ఇన్నింగ్స్ 16వ ఓవర్లో చెత్త బంతులు వేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ ఓవర్లో పంజాబ్ బ్యాటర్లు శామ్ కరన్, హర్ ప్రీత్ సింగ్ పండగ చేసుకున్నారు. శామ్ కరన్ ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టగా... హర్ ప్రీత్ మూడు ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.
బంతులు ఎటు వేస్తున్నాడో తెలియనంతగా, అర్జున్ టెండూల్కర్ ఆ ఓవర్లో బంతిపై నియంత్రణ కోల్పోయాడు. ఓ బంతిని ప్రమాదకర రీతిలో బీమర్ వేయగా, అంపైర్ నోబాల్ గా ప్రకటించాడు. ఆ బంతి బ్యాట్స్ మన్ హర్ ప్రీత్ చేయిని తాకుతూ బౌండరీకి వెళ్లింది. దాంతో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... అర్జున్ టెండూల్కర్ వద్దకు వెళ్లి తర్వాత బంతిని ఎలా వేయాలో చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత బంతి కూడా బౌండరీనే.
కాగా, తన సోదరుడి బౌలింగ్ లో భారీగా పరుగులు లభించడం చూసి, గ్యాలరీలో ఉన్న సారా టెండూల్కర్ రెండు చేతులు తలపై ఉంచుకుని బాధపడడం టీవీల్లో కనిపించింది.