Chandrababu: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులు బాధ కలిగించాయి: చంద్రబాబు

Chandrababu reacts to Simhadri Appanna devotees issue
  • నేడు సింహాచల అప్పన్న నిజరూప దర్శనం
  • ఆలయంలో చందనోత్సవం
  • పోటెత్తిన భక్తులు
  • తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు
  • ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమన్న చంద్రబాబు
వైశాఖ శుద్ధ తదియ నాడు సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయతీ. ఈ సందర్భంగా భక్తులకు సింహాచల అప్పన్నస్వామి నిజరూప దర్శనభాగ్యం కల్పిస్తారు. అందుకోసం భక్తులు సింహాచల క్షేత్రానికి తండోపతండాలుగా తరలివస్తారు. అయితే, ఇవాళ సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 

భక్తులు భారీగా తరలిరాగా, అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేయడంలో విఫలమైనట్టు ఆరోపణలు వచ్చాయి. సాధారణ భక్తుల కంటే వీఐపీలకే ప్రాధాన్యత ఇచ్చారంటూ భక్తులు ఆలయ వర్గాలపై మండిపడ్డారు. స్వరూపానందేంద్ర స్వామి అంతటివారు కూడా ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులు బాధ కలిగించాయని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంతోనే అప్పన్న భక్తులకు ఇంత కష్టం వచ్చిందని విమర్శించారు. దశాబ్దాలుగా లేని ఇబ్బందులు, సమస్యలు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. దేవస్థానాలను వివాద కేంద్రాలుగా మార్చడం తప్ప మీరేం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Chandrababu
Simhadri Appanna
Devotees
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News