Ajinkya Rahane: కుర్రాడిలా కుమ్మేసిన రహానే... చెన్నై 235-4

Rahane flamboyant innings drives CSK to huge total
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్
  • మొదట బ్యాటింగ్ కు దిగి 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 రన్స్ చేసిన సీఎస్కే
  • 29 బంతుల్లో 71 పరుగులు చేసిన రహానే
  • 6 ఫోర్లు, 5 సిక్సులు బాదిన 34 ఏళ్ల రహానే
  • 21 బంతుల్లో 50 పరుగులు చేసిన దూబే
టీమిండియాలో ఇక ఆడడం కష్టమే అని అందరూ డిసైడ్ అయిపోయిన తరుణంలో 34 ఏళ్ల అజింక్యా రహానే ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. కుర్రాళ్లను మరిపిస్తూ... చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మరో అద్భుత ఇన్నింగ్స్ ను ఆవిష్కరించాడు.

ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ పై ఆడుతోంది రహానేనా అనిపించేలా విధ్వంసం సృష్టించాడు. మిగతా బ్యాటర్లతో పోల్చి చూస్తే... పొట్టిగా, బలహీనంగా అనిపించే రహానే నుంచి పిడుగుల్లాంటి షాట్లు జాలువారాయి. 

ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో రహానే పాత్ర కీలకం. వన్ డౌన్ లో వచ్చిన రహానే 29 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 

అంతకుముందు, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 35, ఓపెనర్ డెవాన్ కాన్వే 56 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 73 పరుగులు జోడించి చెన్నై జట్టుకు పటిష్టమైన పునాది వేశారు. అక్కడినుంచి రహానే, శివమ్ దూబే స్కోరుబోర్డును వాయువేగంతో పరుగులు తీయించారు. దూబే 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 50 పరుగులు చేశాడు. 

చివర్లో రవీంద్ర జడేజా 8 బంతుల్లో 2 సిక్సులు బాది 18 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో కుల్వంత్ ఖేజ్రోలియా 2, వరుణ్ చక్రవర్తి 1, సుయాశ్ శర్మ 1 వికెట్ తీశారు.
Ajinkya Rahane
CSK
KKR
Eden Gardens
IPL

More Telugu News