America: అమెరికన్ విమానం ఇంజన్ లో మంటలు.. వీడియో ఇదిగో!

American Airlines Plane Makes Emergency Landing After Engine Catches Fire
  • టేకాఫ్ జరుగుతుండగా పక్షిని ఢీ కొట్టిన ఫ్లైట్
  • తిరిగి అదే ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫ్లైట్ వీడియో
గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఓ పక్షిని ఢీ కొట్టిందా విమానం.. దీంతో ఒకవైపు ఉన్న ఇంజన్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్సింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన. ఈ విమానంలోని ప్రయాణికులు అంతా క్షేమంగానే ఉన్నారని, మరో విమానంలో వారిని పంపించామని విమానాశ్రయం అధికారులు మీడియాకు తెలిపారు. ఆకాశంలో విమానం ఇంజన్ కు నిప్పంటుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓహియో విమానాశ్రయం నుంచి ఆదివారం బోయింగ్ 737 ఫ్లైట్ ఒకటి ఫినిక్స్ కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ సందర్భంగా విమానం ఇంజన్ లో మంటలు రేగడంతో ఫ్లైట్ ను తిరిగి ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఓహియోలోని జాన్ గ్లెన్ కొలంబస్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యేంత వరకూ ఇతర విమానాల రాకపోకలను నిలిపేశారు. రన్ వే పై ఎమర్జెన్సీ సిబ్బందిని, ఫైర్ ఇంజన్లను మోహరించారు. ఫ్లైట్ ల్యాండయిన వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ విమానంలోని ప్రయాణికులను మరో విమానంలో తరలించినట్లు ఎయిర్ లైన్స్ కంపెనీ వెల్లడించింది.
America
Flight
Bird Hit
Engine fire
american airlines

More Telugu News