Heart Problems: గుండె ఎందుకు తట్టుకోలేకపోతోంది..? వైద్యులు ఏం చెబుతున్నారు?

Why Is There a Multifold Rise in Heart Problems in India
  • జీవనశైలి ఎంపికల వల్లే పెరుగుతున్న రిస్క్
  • కార్బోహైడ్రేట్, ఉప్పు అధికంగా వినియోగం
  • వ్యాయామం లోపించడం, పొగతాగడం, ఆల్కహాల్ సేవనం
  • వీటిల్లో మార్పులతో మంచి ఫలితాలు
ఉన్నట్టుండి హార్ట్ఎటాక్ బారిన పడి మరణిస్తున్న వారి కేసులు మన దేశంలో పెరిగిపోతున్నాయి. గాయకులు, కమెడియన్లు, నటులు, యువకుల్లో ఇటీవల హార్ట్ ఎటాక్ లు చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.79 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తుంటే.. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి భారత్ నుంచే ఉంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినా.. మన దేశంలో ఏటా 25-69 ఏళ్ల వయసులోని మరణాల్లో 24.8 శాతం గుండె జబ్బుల వల్లేనని తెలుస్తోంది. దీనిపై వైద్యుల వివరణ చూసినట్టయితే..

కారణాలు/పరిష్కారాలు
గుండె జబ్బులు పెరగడానికి అనారోగ్యకర జీవనశైలి ఎంపికలేనని వైద్యులు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో సమతుల్యత లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, వ్యాయామాలు చేయకపోవడం, పొగతాగడం, మద్యపానం సేవించే అలవాట్లు నష్టం చేస్తున్నాయి. ఇవే కాకుండా జన్యు సంబంధ కారణాలు కూడా గుండె జబ్బులకు నేపథ్యంగా ఉంటున్నాయి. తక్కువ బరువుతో జన్మించిన వారికి కూడా గుండె జబ్బుల రిస్క్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో 86 శాతం వాటిల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల కాలేయంలో ఎక్కువగా కొవ్వు పేరుకుని, అది గుండె జబ్బులకు కారణమవుతోంది.

ఉప్పు వినియోగం కూడా గుండె జబ్బులకు ఒక కారణం. రక్తపోటు పెరిగేందుకు, దీనివల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చేందుకు ఉప్పు కారణమవుతుంది. మన దేశ ప్రజలు సగటున ఒక్కొక్కరు 8 గ్రాముల ఉప్పును రోజువారీ తీసుకుంటున్నారు. కానీ, రోజుకు 3-4 గ్రాములు మించకుండా చూసుకోవాలి. కనీసం 8 గ్రాములు కాకుండా 6 గ్రాములకు తగ్గించినా గుండె జబ్బుల రిస్క్ 25-30 శాతం తగ్గుతుంది. కనుక వీటిల్లో మార్పులు చేసుకోవడం ద్వారా గుండె జబ్బుల రిస్క్ ను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Heart Problems
Multifold Ris
reasons
Cardiologists

More Telugu News