Sharmila: పోలీసులు దురుసుగా ప్రవర్తించారు... అందుకే...!: షర్మిల
- టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు
- సిట్ అధికారులను కలిసే ప్రయత్నం చేసిన షర్మిల
- అడ్డుకున్న పోలీసులు
- ఓ మహిళా పోలీసుపై చేయిచేసుకున్న షర్మిల
- మరో పోలీసు అధికారిని నెట్టివేసిన వైనం
- షర్మిలపై కేసు నమోదు
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారులను కలిసే ప్రయత్నం చేసిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో, షర్మిల ఓ మహిళా పోలీసుపై చేయి చేసుకోవడం, మరో పోలీసు అధికారిని నెట్టివేయడం వీడియోలో కనిపించింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై షర్మిల స్పందించారు. తానొక్కదానినే సిట్ కార్యాలయానికి వెళ్లి టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు వ్యవహారంపై వినతిపత్రం ఇవ్వాలని భావించానని వెల్లడించారు.
"కేసు దర్యాప్తులో అనుమానాలను అధికారికి చెప్పడం నా బాధ్యత. నేనేమైనా క్రిమినల్ నా? హంతకురాలినా? పోలీసులు దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నన్ను నేను కాపాడుకోవడం కోసం ఆత్మరక్షణకు యత్నించడం నా బాధ్యత" అని షర్మిల వివరణ ఇచ్చారు.