sudan: సూడాన్ నుండి తరలింపు, ఆపరేషన్ కావేరీని ప్రారంభించిన కేంద్రం

India Begins Operation Kaveri in Sudan

  • పోర్ట్ సూడాన్ చేరుకున్న 500 మంది భారతీయులు
  • మన పౌరులను కాపాడేందుకు ఆపరేషన్ ప్రారంభించామని జైశంకర్ ట్వీట్
  • స్వదేశానికి తీసుకు వచ్చేందుకు విమానాలు, నౌకలు సిద్ధం

అంతర్యుద్ధం కారణంగా సూడాన్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని భారతీయులను రక్షించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కావేరీని ప్రారంభించింది. యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్ నుండి తన పౌరులను తరలించేందుకు భారత్ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్ చేరుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు ఆపరేషన్ కావేరీ అని పేరు పెట్టారు.

'సూడాన్‌లో చిక్కుకుపోయిన మా దేశ పౌరులను సురక్షితంగా తీసుకు వచ్చేందుకు ఆపరేషన్ కావేరీ కొనసాగుతోంది. సుమారు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారు. మరికొంతమంది కూడా అదే దారిలో రానున్నారు. నౌకలు, విమానాలు వారిని స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. సూడాన్‌లోని మా సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాం' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

వైమానిక దళం C-130J జెడ్డాలో సిద్ధంగా ఉందని, INS సుమేధ భారతీయుల్ని తరలించడానికి పోర్ట్ సూడాన్‌కు చేరుకుందని కేంద్రం ఆదివారమే ప్రకటించింది. వివిధ దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రజలు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. సౌదీలు కాకుండా, భారత్ సహా 12 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నారు. సోమవారం ఉదయం భారతీయ పౌరులతో సహా 28 దేశాల నుండి 388 మందిని ఫ్రాన్స్ తరలించింది.

  • Loading...

More Telugu News