Asok Gajapati Raju: సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైఫల్యానికి ప్రభుత్వానిదే బాధ్యత: అశోక్ గజపతిరాజు

Asok Gajapati Raju slams AP Govt over Simhachalam fiasco

  • నిన్న సింహాచల క్షేత్రంలో స్వామివారి చందనోత్సవం
  • ఏర్పాట్లపై మండిపడిన భక్తులు
  • మంత్రినే నిలదీసిన వైనం
  • ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదన్న అశోక్ గజపతిరాజు
  • ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుంటోందని ఆరోపణ

సింహాచలం క్షేత్రంలో నిన్న చందనోత్సవం రసాభాసగా జరగడం తెలిసిందే. అప్పన్న నిజరూప దర్శనం కోసం వందల రూపాయల ఖర్చు చేసి టికెట్లు కొనుక్కున్న భక్తులు... ఆలయంలో ఎదురైన పరిస్థితులతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అధికారులు వీఐపీల సేవలో తరిస్తూ, సామాన్య భక్తులను పట్టించుకోలేదని మండిపడ్డారు. దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలో నిలుచోవాల్సి వచ్చిందంటూ, మంత్రి బొత్సను సైతం నిలదీసిన పరిస్థితులు కనిపించాయి. 

అంతెందుకు, విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆలయంలో పరిస్థితులు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, ఆలయ అనువంశిక ధర్మకర్త, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు స్పందించారు. 

అప్పన్న చందనోత్సవం వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం కార్యకలాపాల్లో ప్రభుత్వానిది మితిమీరిన జోక్యం అని విమర్శించారు. ప్రభుత్వ జోక్యం భక్తుల పాలిట శాపంలా మారిందని అన్నారు. 

తమ పూర్వీకుల హయాం నుంచి స్వామివారి చందనోత్సవం తొలి దర్శనానికి హాజరవుతున్నానని, ఈ ఏడాది అంత దారుణం ఎన్నడూ చూడలేదని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. వాహనాల పాస్ ల నుంచి దేవుడి కైంకర్యాల వరకు అన్నీ లోపాలేని విమర్శించారు. 

సిరిమానోత్సవం అయినా, రామతీర్థ ఉత్సవాలైనా, సింహాద్రి అప్పన్న చందనోత్సవం అయినా ప్రభుత్వం జోక్యం కారణంగానే నిర్వహణ లోపాలు పెరిగిపోయాయని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News