Delhi: ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టిన వాషింగ్టన్ సుందర్
- ఎనిమిదో ఓవర్ లో మూడు వికెట్లు తీసిన సన్ రైజర్స్ బౌలర్
- రెండు, నాలుగు, ఆరో బంతులకు కీలక వికెట్ల డౌన్
- సన్ రైజర్స్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన ఢిల్లీ
భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ సోమవారం రాత్రి తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. సన్ రైజర్స్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీకి గట్టి షాకిచ్చాడు. ఎనిమిదో ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు. రెండో బంతికే వార్నర్ (21) ను, నాలుగో బంతికి సర్ఫరాజ్ ఖాన్ (10) ను, చివరి బంతికి అమాన్ ఖాన్ (4) ను ఔట్ చేశాడు. దీంతో ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ ఐదు వికెట్లు కోల్పోయి 62 పరుగులు మాత్రమే చేసింది.
వాషింగ్టన్ సుందర్ వేసిన ఎనిమిదో ఓవర్ లోని రెండో బంతిని ఆడిన వార్నర్... బ్రూక్ కు దొరికాడు. నాలుగో బంతికి సర్ఫరాజ్... భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పోవడంతో ఢిల్లీ ఆ తర్వాత ఆచితూచి ఆడింది. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది.
మనీష్ పాండే 34 అక్షర్ పటేల్ 34 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో సుందర్ 3, భువనేశ్వర్ కుమార్ 2, నటరాజన్ 1 వికెట్ తీశారు.