Gone Prakash rao: భార్య కోసమే.. తల్లిని, చెల్లిని జగన్ దూరం పెట్టారు.. గోనె ప్రకాశ్ రావు వ్యాఖ్యలు

senior leader gone prakash rao fires on ys jaganmohan reddy
  • తాను జైలుకు వెళ్తే భార్య భారతిని సీఎం చేయాలనేదే జగన్ వ్యూహమన్న గోనె ప్రకాశ్ రావు
  • షర్మిల రోడ్డెక్కడానికి కారణం ఎవరని ప్రశ్న
  • తండ్రి వైఎస్సార్‌ను పొగిడితే జగన్‌కు నచ్చదని వ్యాఖ్య
  • వివేకా హత్య కేసులో అవివాశ్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణ
తన భార్య భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దూరంగా పెట్టారని తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నేత గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్తే భార్య భారతిని సీఎం చేయాలనేదే జగన్ వ్యూహమని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షర్మిల రోడ్డెక్కడానికి కారణం ఎవరు? జగన్ కాదా? పక్క రాష్ట్రానికి వెళ్లి షర్మిల పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?’’ అని ప్రశ్నించారు. 

జగన్ షర్మిలను చిత్రహింసలు పెడుతున్నారని గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు. ‘‘ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిలను కలిశారు. ఆమెకు సాయం కింద రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారు. అయితే ఆ విషయం తెలుసుకున్న జగన్.. సదరు ఎంపీకి ఫోన్ చేసి.. ‘ఎందుకెళ్లావ్? సాయం చేయాల్సిన అవసరమేం ఉంది?’ అని బెదిరించారు. షర్మిల ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారు’’ అని చెప్పారు.

జగన్‌ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్న షర్మిల మీద ఎందుకంత కోపమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఇక్కడ పార్టీ పెడితే జగన్ పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. ‘‘షర్మిల నా కూతురు లెక్కే కానీ.. జగన్ కొడుకు లెక్క కాదు’’ అని ఆయన అన్నారు.

వైఎస్సార్ ఏడు కొండలు మింగేస్తారని తిట్టిన దాడి వీరభద్రరావును పార్టీలోకి తెచ్చుకున్నారని.. వైఎస్సార్‌కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని గోనె ప్రకాశ్ రావు మండిపడ్డారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనే వారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్‌ను పొగిడితే జగన్‌కు నచ్చదన్నారు. విజయమ్మ కళ్ల నీళ్లు పెట్టుకునేలా మాట్లాడిన బొత్స ఇప్పుడు కిచెన్ కేబినెట్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. విజయమ్మను రాజ్యసభకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు.

వైఎస్ వివేకా కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారా? అని మీడియా ప్రశ్నించగా.. నీలం సంజీవరెడ్డిని కులం అడిగినట్టుందని ప్రకాశ్ రావు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవివాశ్ రెడ్డి పాత్ర ఉందని స్పష్టం చేశారు. చాలా మంది పెద్ద వాళ్లు.. కేంద్ర మాజీ మంత్రులు.. మాజీ సీఎంలు.. మాజీ మంత్రులు జైళ్లకు వెళ్లారని.. వాళ్ల కంటే అవినాశ్ రెడ్డి గొప్పేం కాదన్నారు.

టీడీపీ, జనసేన కలిస్తే 151 సీట్లు దాటుతాయని.. విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు దాటుతాయని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం ఎన్టీఆర్‌తోనే మొదలైందని.. కానీ ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయారని, ఎన్టీఆర్ కంటే జగన్ గొప్పోడా అని ఆయన ప్రశ్నించారు. 
Gone Prakash rao
Jagan
Sharmila
YS Vijayamma
Bharati
TDP
YSRCP

More Telugu News