Amit Shah: టిక్కెట్ల విషయంలో మైనార్టీ, మెజార్టీ అనేది చూడం: అమిత్ షా
- శెట్టార్ పార్టీ వీడినా బీజేపీకి వచ్చిన నష్టం లేదన్న హోంమంత్రి
- హుబ్బళ్ళి-ధార్వాడ్ లో బీజేపీకి ఓటు బ్యాంకు ఉందన్న షా
- జేడీఎస్ లో కుమారస్వామియే శాశ్వత అధ్యక్షుడు, బీజేపీలో అలా కాదని వ్యాఖ్య
హుబ్బళ్ళి-ధార్వాడ్ సెంట్రల్ రీజియన్ లో బీజేపీకి మంచి ఓటు బ్యాంకు ఉందని, తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీయే ముఖ్యమని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్ శెట్టార్ ఓడిపోనున్నారని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ పైన శెట్టార్ చేసిన ఆరోపణలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. అతను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీని ఎవరు నియంత్రించారని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అంతకు ముందులాగే ఉందని చెప్పారు.
బీజేపీలో లింగాయత్ నాయకత్వానికి ప్రాధాన్యత పైన కూడా అమిత్ షా మాట్లాడారు. ఒక లింగాయత్ అభ్యర్థి నుంచి అధికారం చేపట్టిన తర్వాత మరో లింగాయత్ అభ్యర్థికి అధికారం దక్కుతుందన్నారు. ఎక్కడ లింగాయత్ అభ్యర్థులకు టిక్కెట్ నిరాకరించారో అక్కడ తాము టిక్కెట్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ఇద్దరు లింగాయత్ ముఖ్యమంత్రులను అవమానించిందని, లింగాయత్‌లకు బీజేపీ అన్యాయం చేసిందని అనడంలో నైతికత లేదన్నారు. బీజేపీ అన్ని వర్గాలను గౌరవిస్తుందని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి జేడీఎస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అయితే, బీజేపీలో మాత్రం అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, ఆఫీస్ బేరర్లు మారుతూనే ఉన్నారన్నారు. ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడంపై ప్రశ్నించగా అమిత్ షా స్పందిస్తూ... గెలుపు ప్రాతిపదికన టిక్కెట్లు కేటాయించామన్నారు. టిక్కెట్ల పంపిణీలో మైనారిటీ, మెజారిటీ అనే అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.