Viveka Murder Case: వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర.. అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదు: ఆదినారాయణ రెడ్డి

adinarayana reddy fires on cm jagan and avinash reddy about viveka murder case
  • వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లందరూ బయటికొస్తారన్న ఆదినారాయణ రెడ్డి
  • సీబీఐ కాబట్టే నిజానిజాలు బయటపడుతున్నాయని వ్యాఖ్య
  • వివేకా హత్య కేసు దర్యాప్తు చేయాలని అమెరికాకు వెళ్తారా అని ఎద్దేవా 
  • ఎన్ని కోట్లు సంపాదించినా జగన్ అసంతృప్తితోనే ఉంటారని విమర్శ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లందరూ బయటికొస్తారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పక జరుగుతుందని చెప్పారు. అరెస్టు చేస్తారని భయపడే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో మహా కుట్ర ఉందని.. సంబంధం ఉన్న వాళ్లందరికీ శిక్ష తప్పదన్నారు. సీబీఐ త్వరలో యాక్షన్ తీసుకుంటుందని చెప్పారు.

మంగళవారం ఢిల్లీలో మీడియాతో ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ వద్దు అంటున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేయాలని అమెరికాకు వెళ్తారా? అని ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పులన్నీ వారికి అనుకూలంగానే రావాలా? అని ప్రశ్నించారు. సీబీఐ కాబట్టే.. నిజానిజాలు బయటపడుతున్నాయని చెప్పారు. సీబీఐపై ఒత్తిడి ఉండే అవకాశమే లేదన్నారు. 

‘‘కుక్కను ఎవరు చంపారు, గొడ్డలి ఎక్కడ కొన్నారో అందరికీ తెలుసు. సీఐ వద్దంటున్నా.. ఇల్లు క్లీన్ చేశారు. కుట్లు వేశారు. ఇది తమ కుటుంబ సమస్య అని సీఐతో ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు’’ అని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.  

వివేకానందరెడ్డి ఉదయం చనిపోతే సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ వచ్చారని, కప్‌బోర్డుకు రక్తం అంటిందని, ఐదు గొడ్డలి పోట్లు పడ్డాయని ఎలా చెప్పారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డితో మాట్లాడి కథ అల్లారన్నారు. ఇంటి చుట్టూ కెమికల్స్ చల్లారని సీబీఐ చెప్పిందని తెలిపారు. 

‘‘స్పాట్ లో ఉండే అవినాశ్ రెడ్డి గుండెపోటు అంటారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రొద్దుటూరు, కమలాపురం ఎమ్మెల్యేలు హత్య అంటారు. 4 గంటలకు జగన్ వచ్చి 5 గొడ్డలిపోట్లు పడ్డాయని చెబుతారు. ఎవరు చెప్పారు ఇవన్నీ? చేసినోళ్లు, చేయించినోళ్లు మాట్లాడుకుని కథలు చెప్పారు. 6.30కి ఘటన గురించి బయటికి తెలిస్తే.. సినిమా అంతా అయిపోయాక, అమాయకంగా వచ్చి సాయంత్రం మా మీద నింద వేశారు’’ అని ఆరోపించారు.

అవినాశ్ రెడ్డి నిందితుడు అని సీబీఐ చెప్పిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని, అవినాశ్ ను అరెస్టు చేస్తారని అన్నారు. ఒకే తప్పును రెండు మూడు సార్లు చెప్తే నిజం అవుతుందని సీఎం జగన్ అనుకుంటున్నారన్నారు. 

‘‘ఎన్ని కోట్లు సంపాదించినా జగన్ అసంతృప్తితో ఉంటారు. ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.లక్ష కోట్లు సంపాదించారు. ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. సీఎం పదవి వచ్చిందన్న తృప్తి జగన్ కు లేదని, ప్రధాని పదవి కూడా కావాలని ఆయనకు ఆశ పుట్టిందని అన్నారు.
Viveka Murder Case
Adinarayana Reddy
YS Avinash Reddy
Jagan
CBI
YS Vivekananda Reddy

More Telugu News