YS Sharmila: ఒక్కదాన్ని చూసి దాడి చేశారు.. సిగ్గుందా?: జైలు నుంచి విడుదలైన షర్మిల ఫైర్
- తెలంగాణలో ఆఫ్ఘనిస్థాన్, తాలిబన్ పాలన కనిపిస్తోందన్న షర్మిల
- వైఎస్ బిడ్డను.. గోడకు కొట్టిన బంతిలా లేస్తానని హెచ్చరిక
- నేనంటే కేసీఆర్ కు భయం.. ఆయనకు చేతనైంది అదేనని వ్యాఖ్య
- హరీశ్ రావు కొట్టినప్పుడు, కేటీఆర్ బూతులు తిట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్న
- నన్ను తాకేంత దూరంలో ఉన్న వీడియోలు బయటపెట్టలేదని నిలదీత
తానంటే కేసీఆర్ కు భయమని, రాష్ట్రంలో ఆఫ్ఘనిస్థాన్, తాలిబన్ పాలన కనిపిస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమెకు బెయిల్ లభించడంతో ఈ రోజు సాయంత్రం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురును అని, తనను ఎంతగా అణిచివేసే ప్రయత్నం చేస్తే అంతలా గోడకు కొట్టిన బంతిలా లేస్తానని చెప్పారు. పిల్లిని గదిలో పెట్టేసి కొట్టినా పులిగా మారుతుందని, కానీ షర్మిల పిల్లి కాదని, వెనుకడుగు వేసేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ తగ్గేది లేదన్నారు. తాను ఒక్కదానిని చూసి దాడి చేశారు.. సిగ్గుందా అని దుమ్మెత్తి పోశారు. నేను మళ్లీ చెబుతున్నాను.. రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.
ఏం చేతనైంది కేసీఆర్ కు..
ఎన్నో పథకాలను సుసాధ్యం చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని, ఆయనకు ప్రతి ఒక్కటి చేతనైందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ తొమ్మిదేళ్లలో ఏం చేతనైందో చెప్పాలని నిలదీశారు. కనీసం పరిపాలన చేతనైందా, ఆరోగ్యశ్రీ చేతనైందా, డబుల్ బెడ్రూం చేతనైందా అని ప్రశ్నలు సంధించారు. కూతురుకు ఢిల్లీ లిక్కర్ స్కాం, కొడుకుకు రియల్ ఎస్టేట్ చేతనైందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలిగా తాను సిట్ కార్యాలయానికి రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వెళ్లగా తనను పోలీసులు అడ్డుకున్నారన్నారు.
నా శరీరాన్ని తాకేంత దూరంలో పోలీసు
కేసీఆర్ పాలన ఆప్ఘనిస్థాన్ లా, తాలిబన్ పాలనలా కనిపిస్తోందని షర్మిల మండిపడ్డారు. తాను మహిళను అని తెలిసి, తన వద్దకు ఇద్దరు మాత్రమే మహిళా పోలీసులు వచ్చారని, మిగతా వారంతా మగ పోలీసులే అన్నారు. ఓ మగ పోలీసు తన శరీరాన్ని తాకేంత దూరంలో ఉండి, తనతో మాట్లాడారని మండిపడ్డారు. తనను తీసుకు వెళ్లే సమయంలో మహిళా పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారన్నారు. నేను మహిళను అనే ఇంగితం పోలీసులకు లేదని, మహిళా పోలీసులకు కూడా కనీసం అలాంటి ఆలోచన లేదన్నారు. అలాంటప్పుడు తాలిబన్, ఆప్ఘనిస్థాన్ కాకుంటే ఏమిటని నిలదీశారు.
హరీశ్ రావు ఉద్యోగులపై చేయి చేసుకున్నప్పుడు, కేటీఆర్ పోలీసులను బూతులు తిట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. వీరిపై కేసులు ఉండవా అని నిలదీశారు. తన పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడంతో తాను సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే పోలీసులను తోసేసినట్లు చెప్పారు. తాను ఎవరి పైన చేయి చేసుకోలేదన్నారు. మగ పోలీసు తన శరీరాన్ని తాకే దూరంలో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. తాను పోలీసులపై చేయి చేసుకున్నట్లుగా వీడియోలు బయట పెట్టారని, అన్నీ వారికి ఫేవర్ గా ఉన్నవి బయట పెట్టారని, కానీ పూర్తి వీడియోలు పెట్టలేదన్నారు. నన్ను తాకేంత దూరంలో వచ్చిన వీడియోలు, నాపై కన్నెర్ర చేసిన వీడియోలు బయటపెట్టలేదన్నారు.
కానిస్టేబుల్ వేలికి గాయంపై...
తనను నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, దీంతో తాను తన కారు డ్రైవర్ తో ముందుకు పోనియ్ అని చెప్పానని, కానీ పోలీసుల మీదికెళ్లి పోనీయమని అర్థం కాదు కదా అన్నారు. అసలు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి కదా అన్నారు. తాను ఆసుపత్రికి పోతానో.. చర్చికి పోతానో.. గుడికి పోతానో... మసీద్ కు వెళ్తానో.. సిట్ కార్యాలయానికి వెళ్తానో...పోలీసులకు ఏం సంబంధం అన్నారు. సిట్ కార్యాలయానికి కూడా తాను ఒక్కదానిని వెళ్లే ప్రయత్నం చేశానన్నారు.