Punjab: బాదల్ కు నివాళులర్పించడానికి చండీగఢ్ కు ప్రధాని మోదీ
- మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చండీగఢ్ కు చేరుకోనున్న ప్రధాని
- మంగళవారం తుదిశ్వాస వదిలిన పంజాబ్ మాజీ సీఎం బాదల్
- బాదల్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ సంతాపం తెలిపిన మోదీ
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ సీనియర్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో మొహాలీ ఆసుపత్రిలో చేరిన బాదల్.. చికిత్స పొందుతూ మరణించారు. బాదల్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బాదల్ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని నష్టం కలిగించిందని చెప్పారు. తాము ఇరువురూ కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ సంతాపం తెలిపారు. దేశానికి బాదల్ అందించిన సేవలు చిరస్మరణీయమని మోదీ కొనియాడారు.
బాదల్ పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం ప్రధాని మోదీ చండీగఢ్ కు వెళతారని అధికారవర్గాలు తెలిపాయి. పంజాబ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బాదల్ అవిశ్రాంతంగా కృషి చేశారని మోదీ చెప్పారు. రాష్ట్రాన్ని ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించారని, బాదల్ అసాధారణ రాజనీతిజ్ఞుడని చెప్పారు. బాదల్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు మోదీ సంతాపం తెలిపారు. కాగా, ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్ మృతిపై పంజాబ్ లో రెండు రోజులు సంతాపదినాలుగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.