Chandrababu: నరేంద్ర మోదీతో మళ్లీ జత కడతానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు: కారుమూరి
- చంద్రబాబు ప్రజలకు పంగనామాలు పెట్టారన్న ఏపీ మంత్రి
- జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోపిడీ చేశారని వ్యాఖ్య
- పేదలకు తమ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుంటే అడ్డపడ్డారని ధ్వజం
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బుధవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోపిడీ చేశారన్నారు. పేదలకు తమ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తుంటే చంద్రబాబు అడ్డుపడే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీతో మళ్లీ జత కడతానని చంద్రబాబు అనడం సిగ్గుచేటు అన్నారు.
నిన్న ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ... ప్రధాని మోదీ విజన్ తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. గతంలో తాను మోదీ విధానాలను వ్యతిరేకించలేదని, కేవలం ప్రత్యేక హోదా కోసం మాత్రమే ఆయన మీద పోరాటం చేశానని చెప్పారు. పార్టీలు వేరయినప్పటికీ తాను, మోదీ విజన్ ఉన్న నాయకులం అన్నారు. రూ.500కు పైన ఉన్న పెద్ద నోట్లను కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే దేశంలో అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. తాను మోదీ ఆలోచనలకు అనుగుణంగా పని చేయడానికి సిద్ధమన్నారు. భారత్ బలం ఏమిటో ప్రధాని ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రశంసించారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. మోదీ వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్ ను గుర్తిస్తోందన్నారు.