YS Sharmila: కేటీఆర్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు, అందుకే నేను రాజకీయం చేస్తున్నాను: షర్మిల
- తప్పు లేదని భావిస్తే బీఆర్ఎస్ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేయాలని వ్యాఖ్య
- టీ-సేవ్ దీక్షకు కోర్టు ద్వారా అనుమతి వచ్చిందన్న షర్మిల
- రాజకీయాలంటే అసహ్యం.. కానీ ఇక్కడి పరిస్థితుల వల్లే వచ్చానని వ్యాఖ్య
- ఫాదర్ ఇన్ వాటర్ స్కామ్, డాటర్ ఇన్ లిక్కర్ స్కామ్, కేటీఆర్ ఇన్ పేపర్ స్కామ్ అని ఎద్దేవా
సిట్ అధికారులను ప్రగతి భవన్ తన గుప్పెట్లో పెట్టుకుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం విమర్శలు గుప్పించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి ఆమె మాట్లాడారు. సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదన్నారు. తీగలాగితే డొంక కదులుతుందన్నారు. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ను కాపాడేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తే... అధికార పార్టీకి దమ్ముంటే కనుక సీబీఐ దర్యాఫ్తును కోరాలని డిమాండ్ చేశారు. టీ-సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ఆమె మాట్లాడారు.
నేటి టీ-సేవ్ దీక్షకు పోలీసులు అనుమతించలేదని, తాము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నట్లు చెప్పారు. అయితే ఇక్కడి తన దీక్షను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని నిర్ణయించుకున్న పోలీసులు రెండు రోజుల క్రితం తాను సిట్ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో అరెస్ట్ చేశారన్నారు. తన ఒక్క మహిళను అడ్డుకోవడానికి పోలీస్ ఫోర్స్ మొత్తం రావడం ఏమిటన్నారు. తాను సిట్ కార్యాలయం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాజకీయాలు అంటేనే అసహ్యించుకునే తాను ఇప్పుడు తెలంగాణలోని పరిస్థితుల వల్ల రాజకీయం చేయాల్సి వస్తోందన్నారు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లే తాము రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయం చేస్తున్నామన్నారు.
అసలు నాకు ఏమి అవసరం... రోడ్ల మీద పడి పోలీసులతో కొట్లాడటం నాకు అవసరమా... వాళ్లను కొట్టడమైనా... వాళ్ల చేత తిట్టించుకోవడమైనా... వాళ్ల చేత నెట్టించుకోవడమైనా నాకు అవసరమా... ఈ కేసులు నాకు అవసరమా... ఈ జైళ్లు నాకు అవసరమా... ఏది నాకు అవసరం.. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజకీయాలు ఎందుకు చేస్తోంది... ఎందుకంటే సంక్షేమ పాలన కనిపించకుండా పోయింది కాబట్టి.. నిరుద్యోగం ఏ పార్టీలు పట్టించుకోవడం లేదు కాబట్టి... తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మేం దీక్షలు చేశాకే నిరుద్యోగం, నోటిఫికేషన్ల గురించి ప్రతి పార్టీ మాట్లాడుతోందన్నారు.
తనకు పోలీసు డిపార్టుమెంటును అవమానించే ఉద్దేశ్యం లేదని, కానీ పోలీసుల తీరు మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తల్లా ఉందన్నారు. మీరు తన పట్ల ప్రవర్తించిన తీరు కారణంగానే తాను మిమ్మల్ని పక్కకు తోసేశానని చెప్పారు. తాను తెలంగాణ ప్రజల కోసమే రాజకీయం చేస్తున్నట్లు చెప్పారు. తనకు పదవుల మీద ఆశ ఉంటే తన తండ్రి ఉన్నప్పుడే తీసుకునే దానిని అన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉంటే తెలంగాణ ఏర్పడినప్పుడు లేదా 2019 ఎన్నికల సమయంలో వచ్చే దానిని అన్నారు. కానీ ఆయన తెలంగాణకు ఏం చేయలేకపోవడం వల్లే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ఫాదర్ ఇన్ వాటర్ స్కామ్, డాటర్ ఇన్ లిక్కర్ స్కామ్, కేటీఆర్ ఇన్ పేపర్ స్కామ్ అని ఎద్దేవా చేశారు.