Nara Lokesh: రైతులకు జగన్ బిగిస్తున్న మోటార్లను పగులకొట్టండన్న లోకేశ్.. పాదయాత్ర హైలైట్స్
- 81వ రోజు పాదయాత్రను పూర్తి చేసుకున్న లోకేశ్
- మంత్రాలయం నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
- కూలీలకు పనులు కల్పించలేని చెత్త ప్రభుత్వం రాజ్యమేలుతోందని లోకేశ్ విమర్శ
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా 81వ రోజును పూర్తి చేసుకుంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఆయనకు పార్టీ శ్రేణలు, అభిమానులు నీరాజనం పలికారు. ఈ నాటి పాదయాత్ర కోసిగి శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమయింది. కోసిగికి చెందిన 20మంది వలసకూలీలు గుంటూరు వెళ్లి మిర్చి కోత పనులు చేసుకొని ఒక వాహనంలో తిరిగివస్తుండగా, యువనేత లోకేశ్ వారిని పలకరించారు. స్థానికంగా పనుల్లేక 3నెలలు పనుల కోసం గుంటూరు వెళ్లి వస్తున్నామని వారు చెప్పడంతో లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. వ్యవసాయ కూలీలకు పనులు కల్పించలేని చెత్త ప్రభుత్వం రాజ్యమేలుతోందని యువనేత మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వలసలు వెళ్లే అవసరం లేకుండా పంటలకు సాగునీరందించి స్థానికంగానే పనులు లభించేలా చేస్తామని భరోసా ఇచ్చారు.
మార్గమధ్యంలో పాలాల్లోకి దిగి పలువురు రైతులను పలకరించిన యువనేత వ్యవసాయంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందులపాలు చేస్తోందని తెలిపారు. రాబోయే టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గురురాఘవేంద్ర బసలదొడ్డి ఎత్తిపోతల పథకాన్ని యువనేత పరిశీలించారు. కరెంటు బిల్లులు, నిర్వహణ నిధులు విడుదల చేయకుండా ఈ పథకాన్ని మూలనబెట్టడంపై మండిపడ్డారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం లచ్చుమర్రి శివార్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర మాధవరం శివార్లలోని విడిది కేంద్రానికి చేరుకుంది.
నారా లోకేశ్ పాదయాత్ర ఈరోజు 15. 5 కి.మీ. మేర కొనసాగింది. ఇప్పటి వరకు ఆయన 1,046.1 కి.మీ నడిచారు.
మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – మాధవరం శివారు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.30 – మాధవరంలో స్థానికులతో మాటామంతీ.
7.40 – రాయచూర్ సర్కిల్ లో స్థానికులతో సమావేశం.
9.20 – చెట్నిహల్లిలో స్థానికులతో సమావేశం.
11.30 – మంత్రాలయం హోటల్ అబోడ్ వద్ద బీసీలతో ముఖాముఖి.
12.30 – మంత్రాలయం హోటల్ అబోడ్ వద్ద భోజన విరామం.
సాయంత్రం
4.00 – మంత్రాలయం హోటల్ అబోడ్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయంలో పూజలు.
6.00 – మంత్రాలయం శివారు విడిది కేంద్రంలో బస.