JC Prabhakar Reddy: అధికారుల నుంచి రాని స్పందన.. దీక్ష విరమించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
- మున్సిపల్ కమిషనర్ జబ్బర్ తీరును నిరసిస్తూ జేసీ నిరసన దీక్ష
- జిల్లా కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రావాలని డిమాండ్
- గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాన్ని ఇచ్చి దీక్ష విరమణ
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు తన నిరసనను విరమించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తీరును నిరసిస్తూ మున్సిపల్ ఆఫీస్ వేదికగా ఆయన నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఆయన నిరసన కొనసాగుతోంది. తన శిబిరం వద్దకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రావాలని జేసీ డిమాండ్ చేశారు. దీక్షా శిబిరం వద్దే స్నానాలు చేస్తూ, వంటావార్పులతో నిరసనను కొనసాగించారు.
అయితే నాలుగు రోజులుగా తన నిరసన కార్యక్రమం కొనసాగుతున్నా అధికారుల వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, ఆయన శాంతియుతంగా నిరసన దీక్షను విరమించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాన్ని సమర్పించి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తాడిపత్రి టీడీపీ ఇన్ఛార్జి జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు.