Sararat Rangsiwuthaporn: 12 మంది స్నేహితులను చంపిన గర్భవతి
- డబ్బు కోసం మహిళ ఘాతుకాలు
- థాయ్ లాండ్ లో సైనేడ్ తో హత్యలు!
- ఇటీవల ఓ స్నేహితురాలిని చంపిన వైనం
- గతంలో జరిగిన హత్యలు కూడా ఈ మహిళే చేసి ఉంటుందని భావిస్తున్న పోలీసులు
థాయ్ లాండ్ లో పోలీసులు ఇటీవల ఓ మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఓ మహిళ తన స్నేహితురాలినే అంతమొందింది. హంతకురాలిని విచారిస్తుండగా, మరో 11 మరణాల వెనుక కూడా ఆమె హస్తం ఉందన్న దిగ్బ్రాంతి కలిగించే విషయాన్ని పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం ఆ మహిళ గర్భవతి. ఆమె మొత్తం 12 మందిని చంపిందన్న విషయం థాయ్ లాండ్ లో సంచలనం రేకెత్తిస్తోంది. వారందరూ ఆమె స్నేహితులే కాగా, అందరినీ ఆమె సైనేడ్ తో హత్య చేసినట్టు భావిస్తున్నారు.
ఆమె పేరు సరారత్ రంగ్ సివుతాపోర్న్. వయసు 32 సంవత్సరాలు. స్నేహితురాలి హత్య కేసులో మంగళవారం నాడు పోలీసులు రంగ్ సివుతాపోర్న్ ను బ్యాంకాక్ లో అరెస్ట్ చేశారు.
రంగ్ సివుతాపోర్న్ ఏప్రిల్ 14న తన స్నేహితురాలు సిరిపోర్న్ ఖాన్వోంగ్ తో కలిసి రచాబురి ప్రావిన్స్ లో విహారయాత్రకు వెళ్లింది. ఓ నది వద్ద ఇద్దరూ బౌద్ధ మత కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, సిరిపోర్న్ ఖాన్వోంగ్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మృత్యువాత పడింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, శరీరంలో సైనేడ్ విషపదార్థం ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాదు, ఆమె ఫోన్, డబ్బు, బ్యాగ్ లు కనిపించకుండా పోయాయి.
పోలీసుల అనుమానం ఆమె స్నేహితురాలు రంగ్ సివుతాపోర్న్ పైకి మళ్లింది. విచారణలో ఆమే హంతకురాలు అని తేలింది. కాగా, రంగ్ సివుతాపోర్న్ చేతిలో హత్యకు గురైనవాళ్లందరూ 33 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారని, వారందరినీ ఆమె 2020 డిసెంబరు నుంచి 2023 ఏప్రిల్ మధ్య కాలంలో హత్య చేసిందని భావిస్తున్నారు. చనిపోయిన వారిలో రంగ్ సివుతాపోర్న్ మాజీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.
అందరూ ఒకే రీతిలో హత్యకు గురికాగా, వారి వస్తువులు కనిపించడంలేదంటూ బంధువుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందాయి. కేవలం డబ్బు కోసమే రంగ్ సివుతాపోర్న్ ఈ హత్యకు పాల్పడినట్టు వెల్లడైంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... రంగ్ సివుతాపోర్న్ ఓ పోలీసు అధికారి మాజీ భార్య. రంగ్ సివుతాపోర్న్ మాత్రం తాను నిర్దోషినని చెబుతోంది. ఆమె ఎలాంటి నేరాలు చేయలేదని ఆమె తరఫు న్యాయవాది అంటున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి అని, గంటల కొద్దీ పోలీసు విచారణతో ఆమె ఒత్తిడికి గురవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో ఆమె చేతిలో 11 మంది మరణించగా, ఆ మరణాలన్నీ సహజ మరణాలేనని వారి కుటుంబ సభ్యులు భావించడంతో పోలీసులు అప్పట్లో ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ 11 కేసులు హత్యలేనని ఆధారాలు సంపాదించడం పోలీసులకు సవాల్ గా మారింది.