Visakhapatnam: పోలీసుల చేతికి శ్వేత పోస్టుమార్టం నివేదిక, ఆడపడుచు భర్త నుండి లైంగిక వేధింపులు
- కేజీహెచ్ లో ముగ్గురు వైద్యుల బృందంచే పోస్టుమార్టం
- పోలీసులకు అందిన ప్రాథమిక నివేదిక
- శ్వేత ఆడపడుచు భర్త నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడి
విశాఖ ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఇరవై నాలుగేళ్ల శ్వేత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కేజీహెచ్ లో ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించి, ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. శ్వేత మృతిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, అనుమానాస్పద మృతిగా కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో మరో విషయం వెలుగు చూసింది. శ్వేత ఆడపడుచు భర్త నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమె భర్త పైన లైంగిక వేధింపులు, అత్త, ఆడపడుచు పైన వరకట్న వేధింపుల కేసులు పెట్టారు.
ఐదు నెలల గర్భిణీ శ్వేత అనుమానాస్పద కేసుకు సంబంధించి భర్త, అత్త, మామ, ఆడపడుచు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. భర్త తరఫు బంధువులు పోలీసుల అదుపులో ఉండటంతో మృతదేహాన్ని తల్లి, బంధువులకు అప్పగించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.