Nannuri Narsi Reddy: చదవకుండానే ఆ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?.. తమ్మినేనికి నన్నూరి నర్సిరెడ్డి సూటి ప్రశ్న
- తమ్మినేని చెబుతున్న హాల్‌టికెట్ నంబరు డి.భగవంత్‌రెడ్డి పేరిట ఉందన్న నర్సిరెడ్డి
- స్పీకర్ డిగ్రీ సర్టిఫికెట్‌తోపాటు ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ సహా అన్నీ నకిలీవేనన్న నేత
- స.హ. చట్టం ద్వారా వివరాలు సేకరించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి
- నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదవకుండానే ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు డిగ్రీ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన నర్సిరెడ్డి.. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ్మినేని తనదిగా చెబుతున్న హాల్‌టికెట్ నంబరు 1791548430 డి.భగవంత్‌రెడ్డి, తండ్రి బి.స్వామిరెడ్డి పేరిట ఉందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే తమ్మినేని బీకాం డిగ్రీ సర్టిఫికెట్‌తోపాటు ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ సహా అన్నీ నకిలీ సర్టిఫికెట్లేనని అర్థమవుతోందని అన్నారు.
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని మూడేళ్ల లా కోర్సు ఎలా చేశారన్న అనుమానంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కనుక్కుంటే అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ నుంచి 2015-18లో తమ్మినేని బీకాం పూర్తిచేసినట్టు సర్టిఫికెట్లు సమర్పించారని, కానీ ఆ సెంటర్‌లో 2015లో చదువుకున్న మొత్తం 839 మంది విద్యార్థుల జాబితాలో తమ్మినేని పేరు లేదని నర్సిరెడ్డి తెలిపారు. ఇక, మూడేళ్ల లా కోర్సు కోసం తమ్మినేని సీతారాం సమర్పించిన ఓపెన్ యూనివర్సిటీ ప్రతులు నిజమైనవా? కావా? తేల్చాలని స.హ చట్టం ద్వారా అడిగితే.. తమ రికార్డులతో ఆయన సర్టిఫికెట్లు సరిపోలడం లేదని వర్సిటీ అధికారికంగా ధ్రువీకరించిందని నర్సిరెడ్డి తెలిపారు.