Ravanasura: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ సినిమా
- ఆయన హీరోగా నటించిన రావణాసుర
- సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ఫ్లాప్
- నిన్న రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటారు టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ. వరుసగా రెండు విజయాల తర్వాత ఆయన ఇటీవలే ‘రావణాసుర’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. రవితేజ తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, తొలి రోజే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ కొత్తగా ఉన్నా కథనం ఆసక్తిగా లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రవితేజ నటన బాగున్నా.. సుధీర్ వర్మ దర్శకత్వం నిరాశ పరిచింది.
ఈ సినిమాలో రవితేజ జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడలు నటించారు. అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కాగా, ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసి అభిమానులను ఆశ్చర్య పరిచింది.
గురువారం అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సినిమా ఓటీటీలో కనిపించడంతో ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. థియేటర్లలో మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.