kethireddy pedda reddy: జగనన్న కోసం పని చేసిన కార్యకర్తలు బజారున పడ్డారు.. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలు
- జగన్ ను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
- సర్వం పోగొట్టుకున్న కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని ఆవేదన
- తమ ప్రభుత్వంలో తమ కార్యకర్తలకే న్యాయం జరగని పరిస్థితి ఉందని వ్యాఖ్య
- అధికారం శాశ్వతం కాదంటూ హితవు
సీఎం జగన్ ను నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శలు చేశారు. జగనన్న కోసం పని చేసిన కార్యకర్తలు బజారున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను విస్మరిస్తే నాశనమైపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మండలాల్లో పని చేస్తున్న అధికారులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు అధికారులే కారణమని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, కార్యకర్తలను రక్షించుకునేందుకే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
‘‘మన కోసం ఎవరు పని చేశారు? మన వెంట ఎవరు ఉన్నారు? వాళ్లకు ఏం చేయాలనే కనీస ఆలోచన ఉండాలి. సర్వం పోగొట్టుకున్న కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వారికి అన్యాయం జరుగుతోంది తప్ప న్యాయం జరగడం లేదు’’ అని పెద్దారెడ్డి విమర్శలు చేశారు.
శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని పెద్దారెడ్డి ఆరోపించారు. యల్లనూరు మండలంలో 18 ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఒక్కో చోట ఫ్యాక్షన్ మొదలైనా.. మళ్లీ విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో తమ కార్యకర్తలకే న్యాయం జరగని పరిస్థితి ఉందన్నారు. ‘‘దళిత మహిళ ఎంపీపీ అయితే.. ఆమెను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. ఇదేమైనా నియంత పాలనా? గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామనేది ఆలోచన చేయాలి’’ అని హితవు పలికారు.