Prabath Jayasuriya: 71 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక స్పిన్నర్
- సైలెంట్ గా దూసుకొస్తున్న శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య
- ఇప్పటివరకు ఆడింది 7 టెస్టులే!
- అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన స్పిన్నర్ గా రికార్డు
- విండీస్ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ రికార్డు తెరమరుగు
- ఆరుసార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన వైనం
ప్రభాత్ జయసూర్య... ఈ శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్లోకి లేటుగా అడుగుపెట్టినా, వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోతున్నాడు. ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయడం అలవాటుగా మార్చుకున్న ప్రభాత్ జయసూర్య ఇప్పుడు 71 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం శ్రీలంక జట్టు సొంతగడ్డపై ఐర్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. రెండో టెస్టులో పాల్ స్టిర్లింగ్ ను అవుట్ చేసిన ప్రభాత్ జయసూర్య 50వ వికెట్ సాధించాడు. కేవలం 7 టెస్టుల్లోనే 50 వికెట్లు సాధించిన స్పిన్నర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు.
గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది. తొలి 50 వికెట్లు తీయడానికి ఆల్ఫ్ వాలెంటైన్ కు 8 టెస్టులు పట్టగా... ప్రభాత్ జయసూర్య 7 టెస్టుల్లోనే ఈ రికార్డు అందుకున్నాడు.
31 ఏళ్ల ప్రభాత్ జయసూర్య 2022 జులైలో ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 12 వికెట్లు తీయడం విశేషం. ఇప్పటివరకు ఆడింది 7 టెస్టులే అయినా, ఆరుసార్లు 5 వికెట్ల ఫీట్ ను నమోదు చేశాడు.
ఇక, ఓవరాల్ గా అత్యంత తక్కువ టెస్టుల్లో 50 వికెట్లు సాధించిన రికార్డు ఆస్ట్రేలియా పేసర్ చార్లీ టర్నర్ పేరిట ఉంది. చార్లీ టర్నర్ 6 టెస్టుల్లోనే 50 వికెట్లు పడగొట్టాడు.