Mallu Bhatti Vikramarka: భట్టి యాత్రలో జనగామలో రచ్చ... పోటాపోటీగా పొన్నాల, కొమ్మూరి సస్పెన్షన్ ప్రచారం
- భట్టికి స్వాగతం పలికేందుకు ఇరువర్గాల పోటాపోటీ, తోపులాట
- పరిస్థితి అదుపు తప్పకుండా రంగంలోకి దిగిన పోలీసులు
- నిన్నటి నుండే పరస్పరం సస్పెన్షన్ ప్రకటనలు
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జనగామ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేతలు రచ్చకెక్కారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గాల మధ్య విబేధాలు బయటకు వచ్చాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భట్టి జనగామ జిల్లా తరిగొప్పుల, అబ్దుల్ నాగారం తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఆయన పాదయాత్ర అబ్దుల్ నాగారం వద్దకు చేరుకున్న సమయంలో పొన్నాల, కొమ్మూరి వర్గాలు స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఓ సమయంలో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.
పరస్పరం సస్పెన్షన్ ప్రచారం
మల్లు భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ముందు రోజే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారంటూ పొన్నాల వర్గం నాయకుడు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగాజీ పేరిట జోరుగా ప్రచారం సాగింది. నిన్న లింగాజీ అధ్యక్షతన జనగామలో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
కొమ్మూరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి లేఖ పంపించనున్నట్లు తెలిపారు.
పొన్నాల వర్గం నుండి సస్పెన్షన్ ప్రకటన రాగానే, కొమ్మూరి వర్గం కూడా తామే పొన్నాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి పొన్నాల నష్టం కలిగిస్తున్నారని, వయసు మీరినందు వల్ల ఆయనను పార్టీ బాధ్యతల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనగామ కాంగ్రెస్ టిక్కెట్ కొమ్మూరికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.