Voyager-2: 1977లో ప్రయోగించారు... ఇప్పటికీ ప్రయాణిస్తూనే ఉన్న అమెరికా అంతరిక్ష నౌక
- 70వ దశకంలో వాయేజర్-2ను ప్రయోగించిన అమెరికా
- సౌర వ్యవస్థను దాటి వెళ్లిపోయిన నౌక
- ప్రస్తుతం ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తున్న వాయేజర్-2
- 2026 వరకు సేవలందిస్తున్న అమెరికా ఇంజినీర్లు
రోదసి పరిశోధనల్లో అన్ని దేశాల కంటే ముందున్న దేశం అమెరికా. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఖగోళ రహస్యాల ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఉంది. కాగా, 1977లో అమెరికాలో వాయేజర్-1, వాయేజర్-2 అనే అంతరిక్ష నౌకలను ప్రయోగించింది. అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాల గుట్టు విప్పడమే ఆ నౌకలను ప్రయోగించడం వెనకున్న ముఖ్య ఉద్దేశం.
వాటిలో వాయేజర్-2 నౌక ఇప్పటికీ ప్రయాణిస్తూనే ఉందన్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడ్ని కూడా దాటిపోయింది. మన సౌర వ్యవస్థ ప్రభావం ఏమాత్రం లేని శూన్యంలో ప్రయాణిస్తోంది. వాయేజర్-2 నౌక ప్రస్తుతం భూమి నుంచి 2 వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి నుంచి ఏదైనా సిగ్నల్ పంపితే, ఈ నౌకను చేరుకోవడానికి ఒకటిన్నర రోజు సమయం పడుతోంది.
కాగా, వాయేజర్-2 2026 వరకు భేషుగ్గా పనిచేస్తుందని అమెరికా అంతరిక్ష విభాగం ఇంజినీర్లు చెబుతున్నారు. ఇది బ్యాకప్ పవర్ ను ఉపయోగించుకునేలా వారు భూమి నుంచి సిగ్నల్స్ పంపారు. అంతేకాదు, వాయేజర్-2లో ఉన్న పరికరాలను కూడా మరికొన్నాళ్లపాటు పనిచేయించనున్నారు. ఈ నౌకలో ఉన్న శక్తిని పొదుపుగా వాడేందుకు అందులోని కొన్ని పరికరాలను స్విచాఫ్ చేశారు. దాంతో శక్తి ఆదా అవుతుందని, తద్వారా అంతరిక్ష నౌక మరికొన్నాళ్లు సేవలు అందిస్తుందని ఇంజినీర్లు వెల్లడించారు.
వాయేజర్-2లో శక్తి కోసం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ను పొందుపరిచారు. ఇది ప్లూటోనియం నుంచి ఉత్పన్నమయ్యే వేడిని శక్తిగా మార్చుతుంది. ప్రస్తుతం ఈ నౌక శూన్యంలో ప్రయాణిస్తూ, అంత దూరం నుంచి డేటాను భూమికి పంపిస్తుండడం వల్ల శక్తిని కోల్పోతోంది.