Swetha: శ్వేతది ఆత్మహత్యే... భూమిని తన పేరు మీద రాయాలని ఇబ్బంది పెట్టాడు: సీపీ
- శ్వేతకు అత్తింటి వేధింపులు
- తల్లి ముందే గొంతు పట్టుకోవడం భరించలేకపోయిందన్న సీపీ
- ఫిబ్రవరిలోను ఆత్మహత్యాయత్నం చేసిన శ్వేత
- మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవన్న పోలీసులు
విశాఖ ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఇరవై నాలుగేళ్ల శ్వేతది ఆత్మహత్య అని పోలీస్ కమిషనర్ ఓ మీడియా ఛానల్ ముఖాముఖిలో తెలిపారు. శ్వేతకు అత్తింటి నుండి వేధింపులు ఉన్నాయని, తల్లి ముందే తన గొంతు పట్టుకోవడం ఆమె భరించలేకపోయిందని చెప్పారు. ఆమె సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్య చేసుకుందన్నారు. శ్వేత గత ఫిబ్రవరిలోను ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. శ్వేత ఆత్మహత్యకు ముందు ఇంటి నుండి వెళ్లే క్రమంలో ఫోన్ లో తన భర్తతో గొడవ పడిందన్నారు.
పోస్టుమార్టం నివేదికలో మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడైందన్నారు. ఈ కేసుకు సంబంధించి అత్త, మామ, భర్త, ఆడపడుచు భర్త సత్యంలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
శ్వేత పేరు మీద 90 సెంట్ల భూమి ఉందని, ఆ భూమిని తన పేరు మీద మార్చాలని భర్త ఇబ్బంది పెట్టాడని చెప్పారు. ఈ కుటుంబ కలహాలతో శ్వేత మనస్తాపానికి గురైందన్నారు. ఈ ఘటనపై గృహ, లైంగిక హింస వేధింపుల కేసు నమోదు చేసినట్లు చెప్పారు.