NTR Centenary Celebrations: విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభ... హాజరైన చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ

NTR Centenary Celebrations inauguration meeting held in Vijayawada

  • పోరంకి అనుమోలు గార్డెన్స్ లో కార్యక్రమం
  • భారీగా తరలివచ్చిన ప్రజలు
  • సభకు హాజరైన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
  • రజనీకాంత్ కు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభ విజయవాడలో ప్రారంభమైంది. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శతజయంతి వేడుకల ప్రారంభ సభకు ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. 

ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై వచ్చిన రెండు పుస్తకాలను ఈ సభలో రజనీకాంత్ ఆవిష్కరించారు. ఓ పుస్తకం కాపీని బాలకృష్ణకు అందించారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలపై ఓ పుస్తకం, ప్రజలను చైతన్యపరుస్తూ చేసిన ప్రసంగాలతో కూడిన మరో పుస్తకాన్ని విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి ప్రసంగించారు. ఎన్టీఆర్ శతజయంతి సభకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గురించి నాలుగు వాక్యాల్లో చెప్పడం సాధ్యం కాదని, ఆయన జీవితమే ఒక మహా చరిత్ర అని అభివర్ణించారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని లోకేశ్వరి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ గురించి ప్రజలకే ఎక్కువగా తెలుసని అన్నారు. 

సినీ రంగంలోనే కాకుండా, రాజకీయాల్లోనూ ఆయనకు ఆయనే సాటి అని తన తండ్రిని కీర్తించారు. ఎన్టీఆర్ సంతానంగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. ప్రజలందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని లోకేశ్వరి తెలిపారు.

  • Loading...

More Telugu News