Culcutta High Court: రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట తప్పడం నేరం కాదు.. కలకత్తా హైకోర్టు కీలక తీర్పు

Culcutta HC sensational verdict on second marriage

  • మొదటి భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉండగా మరో మహిళతో పరిచయం
  • పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో ఇద్దరూ 11 నెలల పాటు సహజీవనం
  • ఆ తర్వాత కుటుంబ పరువు పోతుందని విడాకులపై వెనక్కు తగ్గిన వైనం
  • మోసం చేశాడని కోర్టుకెక్కిన మహిళ
  • రూ. 10 లక్షల జరిమానా విధించిన అలీపూర్ కోర్టు
  • ఆ తీర్పును కొట్టేసిన కలకత్తా హైకోర్టు

రెండో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆపై మోసం చేశాడంటూ ఓ మహిళ వేసిన కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రెండో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ తర్వాత నెరవేర్చకపోవడం నేరం కిందికి రాదని స్పష్టం చేసింది. మొదటి సంబంధం గురించి తెలిసి కూడా అతడితో ఆమె సంబంధం పెట్టుకుందని, కాబట్టి దీనిని మోసంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..  కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి మొదటి భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉండగానే మరో మహిళతో సన్నిహితంగా మెలిగాడు. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంటులో 11 నెలలపాటు కలిసే ఉన్నారు. శారీరకంగానూ దగ్గరయ్యారు. అయితే, ఆ తర్వాత కుటుంబ పరువు, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొదటి భార్యకు విడాకుల విషయంలో వెనక్కి తగ్గాడు. 

విషయం తెలిసిన మహిళ తనను రెండో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడంటూ అలీపూర్ కోర్టులో కేసు వేసింది. విచారించిన కోర్టు అతడు ఆమెను మోసం చేసినట్టుగా నిర్ధారించి రూ. 10 లక్షల జరిమానా విధించింది. అందులో రూ. 8 లక్షలు మహిళకు, రూ. 2 లక్షలు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే కఠిన కారాగార శిక్ష తప్పదని హెచ్చరించింది. 

అలీపూర్ కోర్టు తీర్పును అతడు కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. విచారించిన కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. తాను ఆమెతో ఏ విషయాన్ని దాచలేదని, తన మొదటి భార్య, పిల్లలు సహా మొత్తం పరిస్థితిని వివరించానని కోర్టుకు తెలిపాడు. అతడి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ రాయ్ చౌధురి.. వ్యక్తిగత జీవితం గురించి అన్నీ తెలిసి కూడా అతడితో ఆమె సంబంధం పెట్టుకుందని, ఆ సంబంధంలో రిస్కు ఉందని ఆమెకు ముందే  తెలుసని, కాబట్టి దీనిని మోసంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, శారీరక సంబంధం పెట్టుకున్నా మోసం చేసినట్టు కేసు పెట్టలేరని పేర్కొన్నారు. అన్నీ తెలిసే ఆమె అతడితో సన్నిహితంగా మెలిగిందని, కాబట్టి ఇక్కడ మోసం చేశారన్న ప్రశ్న తలెత్తబోదంటూ అలీపూర్ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి కొట్టేశారు.

  • Loading...

More Telugu News