Wipro: ఫ్రెషర్ల జీతాలు పెంచడం ఇప్పట్లో కుదరదు: విప్రో స్పష్టీకరణ

Fresher salaries cant be raised they are in oversupply right now says Wipro HR

  • ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలపై స్పందించిన విప్రో
  • తాము పారదర్శకంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నామని స్పష్టీకరణ
  • ప్రస్తుత అవసరాలకు మించి ఫ్రెషర్లు ఉన్నారని వెల్లడి 

టెక్ దిగ్గజం విప్రోలో ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్లకు బాధ్యతలు అప్పగించడంలో (ఆన్‌బోర్డింగ్) జాప్యం జరుగుతోందన్న ఆరోపణలపై సంస్థ మానవ వనరుల విభాగం అధిపతి సౌరభ గోవిల్ తాజాగా స్పందించారు. ఈ అంశంలో సంస్థ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ తమపై ఈ ఆరోపణలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం, ఫ్రెషర్ల జీతాల్లో కోతలు తదితర సమస్యలు ఇటీవల కాలంలో విప్రోను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, పనితీరు సరిగా లేదన్న కారణంతో విప్రోలో కొందరు ఫ్రెషర్లను తొలగించారన్న వార్త కూడా వైరల్ అయ్యింది.

కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రెషర్ల జీతాలు పెంచే అవకాశం లేదని సౌరభ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది విప్రో క్యాంపస్ ఇంటర్వ్యూలు చేపట్టని విషయాన్ని కూడా గుర్తుచేశారు. ‘‘ప్రస్తుతం అవసరాలకు మించి ఫ్రెషర్లు అందుబాటులో ఉన్నారు. మా వద్ద కూడా తగినంత మంది ఉన్నారు. ఇప్పటికే ఆఫర్ లెటర్ ఇచ్చిన వారిని ఉద్యోగంలోకి తీసుకుకోవడమే మా ముందున్న ప్రథమ కర్తవ్యం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 


  • Loading...

More Telugu News