TDP: మా సీఎం జగన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది: టీడీపీ నేత సోమిరెడ్డి
- ‘జగనాసుర చరిత్ర’ పేరుతో టీడీపీ మీడియా సమావేశం
- గూగుల్ లో 6093 అని కొడితే జగన్ చరిత్ర తెలుసుకోవచ్చన్న సోమిరెడ్డి
- తమ క్యాడర్ పై దాడులు చేస్తూ తిరిగి తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపాటు
- దళితుడిని హత్య చేసిన వ్యక్తి బెయిల్ పై విడుదలైతే దండలతో ఊరేగించారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ తో పాటు అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ, తిరిగి మాపైనే 307 కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఈమేరకు శనివారం పార్టీ కార్యాలయంలో ‘జగనాసుర చరిత్ర’ పేరుతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. టీడీపీ క్యాడర్ ను జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.
కోడికత్తి కేసు హత్యాయత్నం కాదని, నిందితుడిగా చెబుతున్న వ్యక్తి జగన్ అభిమానేనని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తేల్చిచెప్పిందని సోమిరెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో మీ నేత ఒకరు దళితుడిని హత్య చేసి, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అప్పగించారని ఆరోపించారు. ఈ కేసులో జైలుకెళ్లిన వ్యక్తి నాలుగు నెలల తర్వాత బెయిల్ పై బయటకు వస్తే పూలదండలతో ఊరేగించారని విమర్శించారు.
ఈ రోజు మా ముఖ్యమంత్రి జగన్ అని చెప్పుకోవడానికి ఆంధ్రులు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. గూగుల్ లో 6093 అని కొడితే జగన్ చరిత్ర మొత్తం బయటపడుతుందని వివరించారు. ప్రపంచంలో ఎక్కడున్నాసరే గూగుల్ లో ఈ నెంబర్ కొట్టి జగన్ నేర చరిత్ర తెలుసుకోవచ్చని అన్నారు. ‘తాతయ్యది హత్య, బాబాయిది హత్య, మామది అనుమానాస్పద మృతి, ఇంకో బాబాయి జైలులో, మరో తమ్ముడు నేడో రేపో జైలుకు, నీ ప్రియ శిష్యుడు శంకర్ రెడ్డి 22 నెలలుగా జైలులో ఉంటున్నాడు’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు.
స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన తలైవా రజనీకాంత్.. ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తుతూ, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మరొకరు లేరంటూ కొనియాడారని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ పై వైసీపీ మంత్రులతో ఘోరంగా తిట్టించారంటూ సీఎం జగన్ పై సోమిరెడ్డి మండిపడ్డారు. ‘నిన్ను పొగిడే వాడు లేడు.. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తప్ప పొగిడేందుకు ఏమీ లేదు. 31 కేసులు ఉన్న జగన్ 30 ఏళ్లు పరిపాలిస్తానని అంటున్నాడు.. అంతేకానీ, ఏ కేసులు లేని వారు పాలించొద్దట. ఇంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని ఎవరినీ చూడలేదు’ అంటూ విమర్శించారు.
దేశంలో ఇంతలా అబద్ధాలు చెప్పే, దోపిడీ చేసే ముఖ్యమంత్రిని తానెక్కడా చూడలేదని సోమిరెడ్డి అన్నారు. వేల కోట్లు దోపిడీ చేసి ఏం చేసుకుంటారని ముఖ్యమంత్రిని నిలదీశారు. ఉన్నదే ఇద్దరు కూతుర్లు.. ఎన్ని వేలు కావాలి, ఏంచేసుకుంటావని సీఎంను ప్రశ్నించారు. 43 వేల కోట్ల దోపిడీ అంటూ సీబీఐ చార్జిషీట్ ఫైల్ చేసిందని సోమిరెడ్డి గుర్తుచేశారు. జగన్ చరిత్రను తాడేపల్లి ఫైల్స్ పేరుతో సినిమా తీస్తే ఒక్క పార్ట్ సరిపోదని, తాడేపల్లి ఫైల్స్ 1, 2, 3, 4.. తీసినా ఇంకా చెప్పాల్సిన చరిత్ర మిగిలే ఉంటుందని సోమిరెడ్డి ఆరోపించారు.