Healthy Heart: 'చక్కని గుండె' కోసం అమెరికా హార్ట్ అసోసియేషన్ సూచిస్తున్న ఆహారం
- గుండె జబ్బుల విషయంలో ఆహారం కీలక పాత్ర
- కొన్ని రకాల ఆహారంతో రక్తపోటు, కొలెస్ట్రాల్ ముప్పు
- నాలుగు రకాల డైట్ నమూనాలను వెల్లడించిన యూఎస్ సంస్థ
తీసుకునే ఆహారం, జీవనశైలి గుండెపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. నేడు గుండె జబ్బులు పెరిగిపోవడానికి ఆహారం విషయంలో సరైన నియమాలు పాటించకపోవడం ప్రధాన కారణం కాగా, సరైన నిద్ర లేకుండా, శారీరక వ్యాయామం లేని జీవన విధానం కూడా ప్రభావం చూపిస్తోంది. మరి ఈ క్రమంలో గుండెకు హాని చేయని ఆహారం ఏది? అన్న సందేహం ఎక్కువ మందికి వస్తుంటుంది. ఎందుకంటే ఆహారం విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుండడంతో పెద్ద అయోమయం నెలకొంది. అందుకే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గుండె జబ్బుల రిస్క్ ను తగ్గించే పలు రకాల డైట్ వివరాలను విడుదల చేసింది.
ఆహారం పాత్ర
గుండె జబ్బుల విషయంలో ఆహారం పాత్ర కచ్చితంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం రక్తపోటు నియంత్రణపై ప్రభావం చూపిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఈ రెండూ గుండె జబ్బులకు కారణమయ్యే పెద్ద సమస్యలు. కనుక రక్తపోటు, కొలెస్ట్రాల్ ను పెంచని ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
డాష్ డైట్
డాష్ అంటే.. డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు రూపొందించిన ఆహార నమూనా ఇది. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలను తీసుకోవాలి. పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు కానీ తక్కువ ఫ్యాట్ ఉండేవి ఎంపిక చేసుకోవాలి. లీన్ ప్రొటీన్ తీసుకోవాలి.
పెస్కాటేరియన్ డైట్
ఇది శాకాహారం. పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్, తృణ ధాన్యాలు, డైరీ ఉత్పత్తులను ఈ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. మీట్, చికెన్ కు దూరంగా ఉండాలి. కావాలంటే చేపలను తీసుకోవచ్చు.
మెడిటెర్రానియన్ డైట్
ఇది మంచి సమతులాహారం. ఆరోగ్యకరమైన ఆహారంగా దీనికి గుర్తింపు కూడా లభించింది. మొక్కల ఆధారిత ఆహారం ఇది. తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నట్స్, మూలికలు, దినుసులు, పప్పు ధాన్యాలను ఇందులో భాగంగా తీసుకోవాలి. యుగర్ట్, చీజ్, చికెన్, గుడ్లను పరిమితంగా తీసుకోవచ్చు.
లాక్టో ఓవో వెజిటేరియన్ డైట్
మొక్కల ఆధారిత ఆహారానికితోడు డైరీ ఉత్పత్తులు, గుడ్లను ఇందులో తీసుకోవచ్చు. గుడ్లు మినహా చికెన్, చేపలు, మీట్ ను కూడా తీసుకోకూడదు.