Gold Smuggling: రూ.2 వేల కోసం 2 కేజీల బంగారాన్ని అక్రమంగా తెచ్చిన మహిళ

woman with 27 gold bars enters india she smuggled them for rs 2000
  • బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడిన మహిళ
  • నడుముకు 27 బంగారు కడ్డీలను చుట్టుకుని వచ్చిన వైనం
  • మొదటిసారి ఈ పనిలోకి దిగినట్లు తెలిపిన నిందితురాలు
బంగ్లాదేశ్‌ నుంచి మన దేశంలోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అరెస్ట్‌ చేసింది. పశ్చిమబెంగాల్‌ లోని 24 పరగణాల జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకుంది. మహిళ నుంచి 27 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుంది. కేవలం రూ.2 వేల కోసం ఇందుకు ఒప్పుకున్నట్లు ఆమె విచారణలో వెల్లడించింది.

బంగ్లాదేశ్‌లోని చిట్టిగాంగ్‌ కు చెందిన ఓ మహిళ బంగారంతో సరిహద్దు దాటినట్లు బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే మహిళా సిబ్బంది చెక్‌పోస్ట్‌ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. 34 ఏళ్ల మనికా దర్‌ వద్ద బంగారు కడ్డీలు కనిపించాయి. దుస్తుల్లో బంగారు కడ్డీలను ఉంచుకుని, వాటిని నడుముకు చుట్టుకుని సరిహద్దులు దాటిస్తున్నట్లు గుర్తించారు.

ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. బెంగాల్‌ లోని బరాసత్ ప్రాంతంలో ఉంటున్న ఓ గుర్తుతెలియని వ్యక్తికి ఈ బంగారం అందించాలని తనకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. ఈ పని చేస్తే రూ.2 వేలు ఇస్తానని సదరు వ్యక్తి చెప్పాడని వెల్లడించింది. మొదటిసారి ఈ పనిలోకి దిగినట్లు చెప్పుకొచ్చింది.

బంగారు కడ్డీలను కస్టమ్స్‌ అధికారులకు బీఎస్ఎఫ్ సిబ్బంది అప్పగించారు. వాటి బరువు 2 కిలోల కంటే ఎక్కువ ఉంటుందని పోలీసులు తెలిపారు. రూ.1.29 కోట్ల వరకు విలువ ఉంటుందని అంచనా వేశారు.
Gold Smuggling
Bangladesh
Border Security Force
West Bengal
27 gold bars

More Telugu News