ipl: సన్ రైజర్స్ హైదరాబాద్ గాడిలో పడేనా?
- నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ మ్యాచ్
- ఆడిన ఏడింటిలో రెండే నెగ్గిన హైదరాబాద్
- ప్లే ఆఫ్స్ చేరాలంటే మరో ఐదు విజయాలు అవసరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడుతోంది. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్ ల్లో కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. ఐదు మ్యాచ్ ల్లో ఓడింది. తద్వారా 4 పాయింట్లతో లీగ్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతోంది. గత మూడు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలైంది. గత రెండు సీజన్లలోనూ ఎనిమిదో స్థానంతో సరిపెట్టిన హైదరాబాద్ ఈసారైనా ప్లే ఆఫ్స్ చేరుకోవాలని చూస్తోంది. అందుకు మిగతా ఏడు మ్యాచుల్లో సన్ రైజర్స్ చాలా కీలకం. ఏడింటిలో కనీసం ఐదు గెలిస్తేనే సన్ రైజర్స్ టాప్ 4లో నిలుస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది.
గత సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో రైజర్స్ పరాజయం పాలైంది. దాంతో, ఈ మ్యాచ్ లో గెలిచి ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అందుకు బ్యాటర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. గత పోరులో రైజర్స్ బౌలర్లు ఢిల్లీని తక్కువ స్కోరుకే కట్టడి చేసినా బ్యాటర్లు ఫెయిలవడంతో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసిన బ్రూక్, మయాంక్ అగర్వాల్ లు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. వీరితో పాటు కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ రాణించాల్సిన అవసరం ఉంది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో టోర్నీకి దూరం అవ్వడం హైదరాబాద్ ను మరింత డీలా పడేలా చేసింది. ఢిల్లీ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టు విజయాల బాట పట్టగలదు.