Preity Zinta: ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేశా.. ప్రీతీ జింటా ఆసక్తికర వ్యాఖ్యలు

Preity Zinta Reveals She Once Made 120 Aloo Paranthas For Punjab Kings Players

  • 2009 ఐపీఎల్ సీజన్ లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్న ప్రీతీ జింటా
  • అబ్బాయిలు ఎంత తింటారో తనకు మొదటిసారి అప్పుడే అర్థమైందని వెల్లడి
  • నాటి ఘటన తర్వాత పరాఠాలు చేయడం మానేశానని వ్యాఖ్య

2009 ఐపీఎల్ సీజన్ లో జరిగిన ఆసక్తికర ఘటనను పంజాబ్ కింగ్స్ సహ యజమానురాలు, సినీ నటి ప్రీతీ జింటా తాజాగా వెల్లడించింది. తన జట్టులోని ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేయాల్సి వచ్చిందని వాపోయింది. ఆ తర్వాత పరాఠాలు చేయడమే మానేసినట్లు చెప్పుకొచ్చింది. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రీతి ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

‘‘ప్రీతీ జింటా తన జట్టు కోసం ఆలూ పరాఠాలను తయారు చేస్తుందని ఎవరు ఊహిస్తారు? ఆ తర్వాత వారు ఆలూ పరాఠా తినడం మానేశారని నేను అనుకుంటున్నా’’ అంటూ ప్రీతిని స్టార్ స్పోర్ట్స్‌లో యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినిపించగానే పక్కనే ఉన్న మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ నవ్వేశాడు.

దాదాపు 12 ఏళ్ల కిందట ఘటనను ప్రీతీ జింటా గుర్తు చేసుకుంది. అబ్బాయిలు ఎంత తింటారో తనకు మొదటిసారి అప్పుడే అర్థమైందని చెప్పింది. ‘‘మేము దక్షిణాఫ్రికాలో (2009లో ఐపీఎల్ మ్యాచ్ లు సౌతాఫ్రికాలో జరిగాయి) ఉన్నాం. ఆటగాళ్లకు మంచి పరాఠాలు వడ్డించలేదు. ‘మీకు పరాటాలు చేయడం నేర్పిస్తాను’ అని అప్పుడు వారికి చెప్పాను. తమకు పరాఠాలు చేసివ్వాలని వాళ్లు అడిగారు. వచ్చే మ్యాచ్‌లో గెలిస్తే ఆలూ పరాఠాలు చేస్తానని వారికి నేను మాటిచ్చాను. వాళ్లు గెలిచారు. తర్వాత నేను 120 ఆలూ పరాటాలు తయారు చేశాను. ఇక అప్పటి నుంచి ఆలూ పరాఠాలు చేయడం మానేశాను" అని ప్రీతి వివరించింది. దీంతో హర్బజన్ సింగ్ అందుకుని.. "ఇర్ఫాన్ ఒక్కడే ఇరవై పరాఠాలు లాగించేసివుంటాడు" అంటూ నవ్వేశాడు.

  • Loading...

More Telugu News