badminton: చరిత్ర సృష్టించిన తెలుగు ఆటగాడు
- ఆసియా బ్యాడ్మింటన్ లో ఫైనల్ చేరిన సాత్విక్, చిరాగ్
- ఈ ఘనత సాధించిన భారత తొలి జంటగా రికార్డు
- రజతం ఖాయం చేసుకున్న సాత్విక్ జంట
ఆంధప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ షెట్టితో కలిసి చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్‌లో ఫైనల్ చేరిన భారత తొలి జంటగా వీరిద్దరూ రికార్డుకెక్కారు. ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కొసాగించిన సాత్విక్, చిరాగ్ కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు. పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో ఆరో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–18, 13–14తో నిలిచిన దశలో వారి ప్రత్యర్థి, లీ యాంగ్–వాంగ్ చిన్ లిన్ (చైనీస్ తైపీ) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది.
వాంగ్ చిన్ గాయపడి తప్పుకోవడంతో వాకోవర్ లభించిన సాత్విక్, చిరాగ్ నేరుగా ఫైనల్ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ సిన్ యెవ్–యి యె (మలేసియా) జంటతో సాత్విక్–చిరాగ్ అమీతుమీ తేల్చుకుంటారు. ఈ టోర్నీ పురుషుల డబుల్స్ లో భారత్ కు ఇప్పటిదాకా ఒకే ఒక్క కాంస్య పతకం 52 ఏళ్ల క్రితం లభించింది. ఫైనల్లో ఓడినా రజతం సాధించిన జంటగా సాత్విక్, చిరాగ్ చరిత్రలో నిలుస్తారు.