Cricket: రెండు వరుస ఇన్నింగ్స్ ల్లో... చివరి 6 బంతుల్లో 4 సిక్స్‌లు కొట్టాడంటూ ధోనీపై శ్రీశాంత్ ప్రశంస
- చివరి ఓవర్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు కొట్టిన ధోనీ
- వరుస మ్యాచ్ లలో సిక్స్‌లు దంచిన బెస్ట్ ఫినిషర్
- ధోనీ ఆటతీరుకు శ్రీశాంత్ ప్రశంసలు
పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరి రెండు బంతుల్లో రెండు సిక్స్ లు కొట్టి అభిమానులను అలరించాడు. ధోనీ అంటే బెస్ట్ ఫినిషర్ అని పేరు ఉంది. అందుకు తగినట్లుగానే ఈ రోజు కూడా ప్రదర్శన చేశాడు. 19వ ఓవర్ ముగిసేసరికి చెన్నై 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. చివరి ఓవర్ ను శామ్ కరన్ వేశాడు. మొదటి బంతికే రహానే కొట్టిన బాల్ ను స్టోన్ క్యాచ్ పట్టాడు. ఈ చివరి ఓవర్ ఆఖరి రెండు బంతులను ఆడిన ధోనీ వాటిని సిక్సులుగా మలిచాడు. మొత్తం నాలుగు బంతుల్లో 13 పరుగులు చేశాడు.
ధోనీ సిక్స్ ల పైన మాజీ ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ స్పందించాడు. 'ధోనీ ఇవాళ మొదటి బంతిని మిస్ చేశాడు. అయితే క్రితంసారి చెన్నైలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ రెండు బంతుల్లో 2 సిక్స్ లు కొట్టాడు. ఈసారి 4 బంతులు ఆడితే 3 బంతులు అతడి బ్యాట్ కు తాకాయి... వాటిలో రెండు సిక్స్ లు వెళ్లాయి. అంటే చెన్నైలో వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో చివరి 6 బంతులాడితే 5 బంతులు అతడి బ్యాట్ కు తాకాయి. అందులో 4 సిక్సులు వెళ్లాయి' అని మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ లో శ్రీశాంత్ పేర్కొన్నాడు.