Chandrababu: కుప్పం ఇంతకాలం ప్రశాంతంగా ఉంది... కానీ!: డీజీపీకి చంద్రబాబు లేఖ
- పోలీసుల సహకారంతో వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని వ్యాఖ్య
- టీడీపీ నేత వి.బాలకృష్ణ ఇంటిపై దాడులు చేశారని విమర్శ
- వైసీపీ దాడులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణ
- ఫిర్యాదు చేస్తే బాధితులపై కేసులు పెడుతున్నారని లేఖలో వెల్లడి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం డీజీపీకి లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలను లేఖలో ప్రస్తావించారు. పోలీసుల సహకారంతో వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ నేత వి.బాలకృష్ణ ఇంటిపై దాడులు చేశారని, ఆయన బైక్ ను తగులబెట్టి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారని తెలిపారు. ఇంతకాలం కుప్పం ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశంగా ఉండేదని చెప్పారు.
కానీ ఇప్పుడు వైసీపీ దాడులకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. తమపై దాడులు చేశారని ఫిర్యాదు చేస్తే... నిందితులపై కాకుండా బాధితుల మీద పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలపై పెట్టిన అక్రమ, తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని అందులో డిమాండ్ చేశారు.
అరెస్టును ఖండిస్తూ ట్వీట్
టీడీపీ నేతలు ఆదిరెడ్డి ఆప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ ల అరెస్ట్ ను ఖండిస్తూ చంద్రబాబు మధ్యాహ్నం ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయే తప్ప... వారిలో మార్పు రావడం లేదని పేర్కొన్నారు. ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం.... అక్రమ కేసులను, అరెస్టులను మాత్రమే నమ్ముకుందని విమర్శించారు.