Badminton Asia Championships: బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి.. నెరవేరిన భారత దశాబ్దాల కల!

Satwiksairaj and Chirag Shetty wins doubles medal in Badminton Asia Championships

  • దుబాయ్‌లో ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
  • ఫైనల్‌లో మలేసియా జోడీని మట్టికరిపించిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ
  • 58 సంవత్సరాల తర్వాత భారత్‌కు పతకం

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ దశాబ్దాల కల నెరవేరింది. దుబాయ్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడి అద్భుత విజయం సాధించింది. దుబాయ్‌ అల్ నసర్ క్లబ్‌లోని షేక్ రషీద్ బిన్ హమ్దాన్ ఇండోర్ హాల్‌లో జరిగిన ఈ ఫైనల్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్లు అయిన మలేసియాకు చెందిన యెన్ సిన్-టియో జోడీతో ప్రపంచ 6 ర్యాంకర్లు అయిన సాత్విక్-చిరాగ్ జోడీ తలపడింది.

తొలి గేమ్‌లో ఓడిన భారత జంట ఆ తర్వాత పుంజుకుని వరుస సెట్లలో (16-21, 21-17, 21-19) విజయం సాధించి దేశానికి స్వర్ణ పతకం అందించింది. ఇది భారత్‌కు చారిత్రక విజయం. దాదాపు 58 సంవత్సరాల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. 1965లో భారత ఆటగాడు దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో బంగారం పతకం కొల్లగొట్టాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఇప్పుడు డబుల్స్‌లో భారత్‌కు స్వర్ణం చిక్కింది. 

1971లో దీపు ఘోష్-రామన్ ఘోష్ జంట కాంస్య పతకం సాధించింది. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమం కాగా, ఇప్పుడు దానిని సాయి-చిరాగ్ జోడీ మెరుగుపరిచారు. కాగా, ఈ జోడీ ఈ ఏడాది స్విస్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన సాయి, చిరాగ్‌పై భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. వారికి రూ. 20 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News