MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ పై చెన్నై హెడ్ కోచ్ కీలక ప్రకటన
- రిటైర్మెంట్ పై ధోనీ ఎలాంటి సంకేతం ఇవ్వలేదన్న స్టీపెన్ ఫ్లెమింగ్
- సీఎస్కే సారథి రిటైర్మెంట్ పై సర్వత్రా ఆసక్తి
- కెరీర్ చివరి దశలో ఉన్నానంటూ ఇటీవలే ప్రకటించిన ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఈ సీజన్ ముగింపు తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడని ఎన్నో అంచనాలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎందరో ప్రముఖ క్రికెటర్లు కూడా స్పందించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం, ధోనీలో ఇంకా సత్తా ఉందని తేల్చేశాడు. దీనిపై ధోనీ కూడా పరోక్షంగా గతంలో స్పందించాడు. తనకు వయసు మళ్లుతోందని, ఆ విషయంలో తనకు అవగాహన ఉందని పేర్కొన్నాడు. కెరీర్ చివరి దశలో ఉన్నానంటూ ప్రకటించాడు. అంతేకానీ, ఫలానా అప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఎవరూ చెప్పరు కదా. దీంతో ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు.
ఇదే అంశాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ వద్ద మీడియా ప్రస్తావించింది. రిటైర్మెంట్ గురించి ధోనీ మీకు ఏమైనా చెప్పాడా? అంటూ ప్రశ్నించగా.. ‘‘లేదు. అతడు (ధోనీ) రిటైర్మెంట్ పై ఎలాంటి సంకేతం ఇవ్వలేదు’’ అని బదులిచ్చారు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా జట్టును ఓడించిన అనంతరం కూడా ధోనీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు వీడ్కోలు పలికేందుకే రాజస్థాన్ అభిమానులు సీఎస్కే జెర్సీలతో వచ్చినట్టు చెప్పాడు. తాను చెపాక్ స్టేడియంలో సీఎస్కే అభిమానులకు గుడ్ బై చెప్పిన తర్వాతే ఐపీఎల్ ఆడడం ఆపేస్తానని 2001 సీజన్ తర్వాత ధోనీ పేర్కొనడం గమనార్హం. కానీ, ఈ సీజన్ లోనూ ధోనీ కుర్రాళ్లకు తీసిపోకుండా ఫిట్ గా ఆడుతుండడం గమనార్హం.