Nara Lokesh: సాంత్వన చేకూర్చనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు?: జగన్ కు లోకేష్ ప్రశ్న
- ఏ రైతును కదిలించినా కన్నీళ్లు, కష్టాలే కనిపిస్తున్నాయన్న లోకేశ్
- పంట దెబ్బతిన్నప్పటికీ రైతును పట్టించుకోవడం లేదని విమర్శ
- కడిమెట్ల శివారులో మొక్కజొన్నను పరిశీలించిన లోకేశ్
అన్నదాత వద్దకు వచ్చి కనీస సాంత్వన చేకూర్చలేని ఈ ప్రభుత్వం ఎందుకు? అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేశ్. ఆయన యువగళం పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన పాదయాత్ర మార్గంలో ఏ రైతును కదిలించినా కన్నీళ్లు, కష్టాలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని, కానీ రైతును కనీసం పట్టించుకునే నాథుడు లేడన్నారు.
రెండు ఎకరాల్లో మొక్కజొన్న వేసేందుకు పెట్టుబడి యాభై వేల రూపాయలు అవుతోందని, కౌలు నలభై వేల రూపాయలు అవుతోందని, మొత్తం తొంబై వేల రూపాయలు ఖర్చు అయితే దిగుబడి మాత్రం రూ.9వేలు మాత్రమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు పంట నష్ట పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆయన కడిమెట్ల శివారులో దెబ్బతిన్న మొక్క జొన్న పంటను పరిశీలించారు.