Jagan: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది లేరనే మాట రాకూడదు: సీఎం జగన్

CM Jagan reviews state health and medical dept

  • రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా ఆడిట్ చేయాలని ఆదేశం
  • ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టీకరణ
  • క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలని సూచన

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది లేరనే మాట రాకూడదని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడిట్ చేయాలని, ప్రతి ఆసుపత్రినీ ఒక యూనిట్ గా తీసుకుని ఆడిట్ చేయాలని ఆదేశించారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి బోధన ఆసుపత్రి వరకు ఆడిట్ చేయాలని వివరించారు. 

ఖాళీగా ఉన్న పోస్టులు గుర్తించి వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ వచ్చే ముందు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. 

క్రమం తప్పకుండా కంటి పరీక్షలు నిర్వహిస్తుండాలని, ప్రజల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపై అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. 

ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News