Nara Lokesh: అధికారంలోకి వచ్చాక చేనేత వ్యవస్థను దత్తత తీసుకుంటా: నారా లోకేశ్
- ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- గోనెగండ్ల వద్ద 1,100 కి.మీ మైలురాయి చేరిక
- అధికారంలోకి వచ్చాక టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్న లోకేశ్
- చేనేతకు జీఎస్టీ రద్దు చేస్తామని హామీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 86వ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. గోనెగండ్లలో పాదయాత్ర 1,100 కి.మీ మైలురాయి చేరుకుంది. అధికారంలోకి వచ్చాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చిన లోకేశ్ అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు ద్వారా సుమారుగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ప్రకృతి కన్నెర్ర జేసింది... ప్రభుత్వ పెద్దలు పత్తాలేరు!
కడిమెట్ల శివారులో అకాలవర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించిన లోకేశ్ రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాదయాత్ర దారిలో ఏరైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే సమాధానంగా వస్తున్నాయని తెలిపారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు ఘోరంగా దెబ్బతింటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు.
రెండెకరాల మొక్కజొన్న వేస్తే పెట్టుబడి రూ.50 వేలు, కౌలు రూ.40 వేలు కలిపి రూ.90వేలు పెట్టుబడి అయితే, ఇప్పటిదాకా రూ.9 వేలు దిగుబడి వచ్చిందని, అకాల వర్షాలకు ఏరు వచ్చి పంట కొట్టుకుపోతే పట్టించుకునే నాథుడు లేడని వివరించారు. అన్నదాతల వద్దకు వచ్చి కనీసం స్వాంతన చేకూర్చలేని ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డీ? అంటూ లోకేశ్ నిలదీశారు.
చేనేతకు జీఎస్టీ రద్దు చేస్తాం!
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత వ్యవస్థను తాను దత్తత తీసుకుంటానని నారా లోకేశ్ ప్రకటించారు. చేనేతకు జీఎస్టీ రద్దు చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం రాళ్లదొడ్డిలో చేనేతలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
"ప్రతి చేనేత కార్మికుడికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేనేత గుర్తింపు కార్డులు అందజేసి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టు రైతులకు ప్రభుత్వం పడ్డ బకాయిలన్నీ చెల్లిస్తాం. చేనేత, పవర్ లూమ్ వస్త్రాలకు తేడా తెలిసేలా ప్రత్యేక లేబులింగ్ వ్యవస్థను తీసుకొస్తాం. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎమ్మిగనూరు లో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం" అని భరోసా ఇచ్చారు.
ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకుంటాం!
ఆత్మహత్య చేసుకున్న ప్రతి చేనేత కార్మికుడి కుటుంబాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
"ఆప్కోను జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆప్కో బకాయిలు తీర్చి బలోపేతం చేస్తాం. టీడీపీ హయాంలో చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకున్నాం. యార్న్, కలర్, కెమికల్స్ అన్ని సబ్సిడీలో అందించాం. రూ.111 కోట్లు చేనేత రుణాలు మాఫీ చేశాం. ఆదరణ పథకంలో మగ్గంతో సహా ఇతర పనిముట్లు అందజేశాం. వర్షాకాలంలో చేనేత కార్మికులకు 8 వేల రూపాయిల భృతి ఇచ్చి ఆదుకున్నాం.
ఒక్కో కార్మికుడికి టీడీపీ హయాంలో ఏడాదికి రూ.50 వేలు సాయం అందేది. ఇప్పుడు సొంత మగ్గం ఉన్న వారికే నేతన్న నేస్తం అంటూ కేవలం 10 శాతం మందికి మాత్రమే రూ.24 వేలు ఇచ్చి జగన్ చేతులు దులుపుకున్నారు" అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
వలసకూలీలను కలిసి కష్టాలు తెలుసుకున్న లోకేశ్
ఎమ్మిగనూరు శివారు సబ్ స్టేషన్ ప్రాంతంలో వలస కూలీలతో మాట్లాడిన లోకేశ్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. పిల్లలతో సహా గుంటూరు జిల్లాకి పనుల కోసం వెళ్లి తిరిగి వస్తున్న కోసిగికి చెందిన వలస కూలీలతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ... గుంటూరు వెళ్లి పనిచేస్తే రోజుకి రూ.350 కూలీ వస్తుందని తెలిపారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో బతకడం కష్టంగా మారిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సాగునీరు అందించాలని కోరారు. స్థానికంగా పనులు దొరికేలా చెయ్యాలని, వలస కష్టాలు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్న జగన్ రాయలసీమకి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. వలస కూలీల కష్టాలు జగన్ కి కనపడటం లేదా? అని ప్రశ్నించారు. వేలాది మంది ఊర్లు ఖాళీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు.
"రాయలసీమ ప్రాజెక్టుల పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.11,700 కోట్లు ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం అందులో 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం. స్థానికంగా వ్యవసాయ పనులు దొరికేలా చర్యలు తీసుకుంటాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వలసల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటాం" అని భరోసా ఇచ్చారు.
*యువగళం పాదయాత్ర వివరాలు:*
*ఇప్పటి వరకు నడిచిన దూరం - 1102.8 కి.మీ.*
*ఈ రోజు నడిచిన దూరం – 14.9 కి.మీ.*
87వరోజు (2-5-2023) యువగళం వివరాలు*
*ఎమ్మిగనూరు/ కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గాలు (కర్నూలు జిల్లా):*
ఉదయం
7.00 - గాజులదిన్నె విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం
7.20 - గాజులదిన్నె గ్రామస్తులతో సమావేశం.
8.15 - కైరవాడిలో గ్రామస్తులతో మాటామంతీ.
8.35 - హెచ్.కైరవాడి బస్టాండ్ లో రైతులతో సమావేశం.
9.00 – కైరవాడిలోని పరమేశ్వరి దేవాలయం వద్ద గ్రామస్తులతో సమావేశం
9.40 – కైరవాడిలో రైస్ మిల్ వద్ద గ్రామస్తులతో సమావేశం.
10.20 - పుట్టపాశంలో గ్రామస్తులతో సమావేశం.
మధ్యాహ్నం
12.00 - వేముగోడులో గ్రామస్తులతో సమావేశం.
12.20 - వేముగోడులో భోజన విరామం.
సాయంత్రం
4.00 - వేముగోడు నుండి పాదయాత్ర ప్రారంభం.
4.10 - కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.45 - వర్కూరు గ్రామస్తులతో సమావేశం.
6.25 - కోడుమూరు శివార్లలో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.
7.25 - కోడుమూరు శివారు విడిది కేంద్రంలో బస.
*******