USA: తప్పిపోయిన ఇద్దరు టీనేజర్ల కోసం గాలిస్తుండగా.. ఏడు మృతదేహాలు లభ్యం!
- అమెరికాలో ఓ రేపిస్ట్ ఇంట్లో బయటపడ్డ మృతదేహాలు
- పరారీలో నిందితుడు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
- ఓక్లహోమా రాష్ట్రంలోని హెన్రియెట్టా నగరంలో ఘోరం
టీనేజ్ యువతులు ఇద్దరు తప్పిపోయారని ఫిర్యాదు రావడంతో గాలింపు చర్యలు చేపట్టిన అమెరికా పోలీసులు ఓ ఇంట్లో ఏడు మృతదేహాలు బయటపడడంతో నివ్వెరపోయారు. ఓక్లహోమా రాష్ట్రంలో సోమవారం నాడు జరిగిందీ దారుణం. హెన్రియెట్టా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
హెన్రియెట్టా సిటీకి చెందిన ఇద్దరు టీనేజ్ యువతులు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. చివరిసారిగా వారిని ఓ నేరస్థుడితో చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువతుల ఆచూకీ కోసం గాలిస్తూనే సదరు నేరస్థుడు జెస్సీ మెక్ ఫాడెన్ గురించి ఆరా తీశారు. చిన్నారులపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాడెన్.. ఓ యువతిపై అత్యాచారం చేశాడని కోర్టు నిర్ధారించింది. ఈ కేసు విచారణకు ఫాడెన్ సోమవారం కోర్టులో హాజరుకావాల్సి ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో కోర్టు దగ్గర కొంతమంది పోలీసులు మాటు వేయగా.. మరికొంతమంది ఫాడెన్ ఇంటికి వెళ్లారు.
ఫాడెన్ ఇంట్లో తనిఖీ చేయగా ఏడు మృతదేహాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. వాటిలో తప్పిపోయిన యువతుల మృతదేహాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే, ఫాడెన్ మాత్రం దొరకలేదని వివరించారు. పరారీలో ఉన్న నిందితుడు ఫాడెన్ ను పట్టుకోవడం కోసం అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. మరోవైపు, సోమవారం కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఫాడెన్ పై జడ్జి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.