Virat Kohli: కోహ్లీతో గొడవ.. వాగ్వివాదానికి కారణమైన సంభాషణ ఇలా..!
- సోమవారం మ్యాచ్ అనంతరం గొడవ
- మమ్మల్ని పదేపదే ఎందుకు దూషిస్తున్నావని కోహ్లీని ప్రశ్నించిన మేయర్స్
- మేయర్స్‌ను గౌతీ పక్కకు లాగేయడంతో గొడవ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవ సంచలనమైంది. వారిద్దరూ పరస్పరం వాదులాడుకుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ కోహ్లీకి కోటి రూపాయలు, గంభీర్‌కు రూ. 25 లక్షల జరిమానా విధించింది. కొందరు వీరిద్దరి మధ్య గొడవను చిన్నపిల్లల తీరుగా భావిస్తే, మరికొందరు వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఇలా బయటపడిందని అంటున్నారు. మరికొందరు మాత్రం ‘మాంచి మసాలా’ లభించిందని కామెంట్లు చేశారు. ఏది ఏమైనా ‘జెంటిల్మన్ గేమ్’లో ఇలాంటివి కూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
వైరల్ అయిన వీడియోలో.. మ్యాచ్ అనంతరం విరాట్, కైల్ మేయర్స్ పక్కపక్కన నడుచుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో కోహ్లీని ఉద్దేశించి తమను పదేపదే ఎందుకు దూషించావని మేయర్స్ ప్రశ్నించాడు. దానికి కోహ్లీ బదులిస్తూ.. నువ్వెందుకలా నావైపు తేరిపార చూశావని ప్రశ్నించాడు. అంతకుముందు అమిత్ మిశ్రా అంపైర్‌కు కోహ్లీపై ఫిర్యాదు చేశాడు. నవీన్ ఉల్ హక్ ను కోహ్లీ పదేపదే దూషిస్తున్నాడని పేర్కొన్నాడు.
వారిద్దరి మధ్య జరుగుతున్న వాగ్వివాదాన్ని చూసిన గంభీర్.. మేయర్స్‌ను పక్కకి లాగేసి అతడితో మాట్లాడొద్దని చెప్పాడు. అప్పుడు కోహ్లీ ఏదో అనడంతో అది ఇద్దరి మధ్య వాగ్విదానికి కారణమైంది. ‘‘ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు’’ అని కోహ్లీని గౌతీ ప్రశ్నించాడు. ‘‘నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావ్? నీతో చెప్పేదేం లేదు’’ అని కోహ్లీ బదులిచ్చాడు.
దీనికి గంభీర్ బదులిస్తూ.. ‘‘నువ్వు మా ఆటగాడిని తిట్టడమంటే మా కుటుంబ సభ్యులను తిట్టినట్టే’’నని అన్నాడు. దీనికి కోహ్లీ కొంచెం ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘‘అయితే, నువ్వు నీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకో’’ అనడంతో గంభీర్ కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చాడు. ‘‘అంటే ఇప్పుడు నేను నీ నుంచి నేర్చుకోవాలంటావ్’’ అని అన్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వివాదంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వాగ్వివాదం మరింత ముదురుతుండడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వారిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.