sarpanch suicide: సర్పంచ్ ఆత్మహత్య.. ఆయన కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం!
- కొత్త శ్మశాన వాటికను ఇటీవల కట్టించిన సర్పంచ్ కంచ కుమారస్వామి
- ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో ఆత్మహత్య
- హనుమకొండ జిల్లా హైబోత్ పల్లి గ్రామంలో ఘటన
ఓ గ్రామ సర్పంచ్ కొత్తగా కట్టించిన శ్మశాన వాటిక ఆయన దహన సంస్కారాలతోనే మొదలైంది. ఈ దురదృష్టకరమైన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలంలో చోటుచేసుకుంది. హైబోత్ పల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి (35).. కొంత కాలం క్రితం తమ గ్రామంలో కొత్త శ్మశాన వాటికను నిర్మించారు. ఐతే దాని ప్రారంభం ఇంకా జరగలేదు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుమారస్వామి కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. భార్య పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లిన కుమారస్వామి.. కాపురానికి రావాలని అడగ్గా భార్య అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై చేనువద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. తర్వాత తన పెద్ద కొడుక్కి సమాచారం ఇచ్చాడు.
కుమారస్వామి తల్లి, కుటుంబసభ్యులు అక్కడికి వచ్చి పరకాల ఆసుపత్రికి అతడిని తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. దీంతో కుమారస్వామి కట్టించిన శ్మశాన వాటికలోనే ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు.
నిజానికి హైబోత్ పల్లి గ్రామస్తులు కుమారస్వామిని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.24 లక్షల వరకు అప్పు చేశాడని సమాచారం. డంప్ యార్డు, శ్మశానవాటిక పనుల కోసం సొంత డబ్బు పెట్టుకోగా.. బిల్లులు రాలేదని, అందుకే అప్పుల పాలయ్యారని గ్రామస్తులంటున్నారు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు జరిగి భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.