ipl: లక్నో జట్టుకు షాక్.. గాయంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ నుంచి ఔట్
- ఆర్సీబీతో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కేఎల్
- డబ్ల్యూటీసీ ఫైనల్ కూ దూరమయ్యే అవకాశం
- పేసర్ జైదేవ్ ఉనద్కట్ భుజానికి గాయం
ఐపీఎల్ 2022లో అనూహ్యంగా ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో తొడ కండరాలు పట్టేయంతో కింద పడిన అతను వెంటనే మైదానాన్ని వీడాడు. చివరి బ్యాటర్ గా బ్యాటింగ్ కు వచ్చినా కనీసం రన్నింగ్ చేయలేక పోయాడు. గాయం కాస్త పెద్దది కావడంతో కేఎల్ రాహుల్ ఐపీఎల్‌తో పాటు జూన్ లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది టీమిండియాకు ఎదురుదెబ్బే కానుంది.
కేఎల్ రాహుల్ టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ కావడంతో అతడి బాధ్యతను బీసీసీఐ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అతనికి ముంబై బోర్డు మెడికల్ స్టాఫ్ స్కానింగ్స్ నిర్వహించనుంది. ‘కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నోలో జట్టుతో ఉన్నాడు. బుధవారం సీఎస్కేతో జరిగే మ్యాచ్ చూసిన తర్వాత గురువారం శిబిరం నుంచి వైదొలుగుతాడు. ముంబైలో బీసీసీఐ వైద్య సదుపాయంలో అతనికి స్కానింగ్ నిర్వహిస్తారు. అతనితో పాటు జయదేవ్ పరిస్థితిని బీసీసీఐ పర్యవేక్షిస్తుంది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
లక్నో జట్టుకే ఆడుతున్న పేసర్ జైదేవ్ ఉనద్కట్ సైతం ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. అతని ఎడమ భుజానికి తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. ఉనద్కట్ కూడా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ జట్టులో ఉన్నాడు. ప్రస్తుతం సమాచారం మేరకు రాహుల్, ఉనద్కట్ ఇద్దరూ ఈ వారం ఎన్ సీఏలో రిపోర్టు చేసే అవకావ ఉంది.